APAAR ID: మెడికల్ ఎంట్రన్స్ లకు అపార్ ఐడీ తప్పనిసరా ? తేల్చేసిన ఎన్టీఏ..
త్వరలో నీట్ యూజీ (NEET UG 2025) పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నీట్ యూజీ పరీక్ష రాసే అభ్యర్ధుల కోసం జాతీట టెస్టింగ్ ఏజెన్సీ కొత్త నిబంధనల్ని విడుదల చేసింది. ఇందులో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడీ (APAAR ID)ని తప్పనిసరి చేసింది. ఈసారి నీట్ రాసే అభ్యర్ధులకు కచ్చితంగా ఆధార్ సంఖ్యతో పాటు అపార్ ఐడీ కూడా కలిగి ఉండాల్సిందేనని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తేల్చిచెప్పేసింది. దీని వెనుక కీలక కారణం ఉంది.
జాతీయ స్ధాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో లీకుల గోల పెద్ద సమస్యగా మారిపోయింది. లీకుల్ని నియంత్రించేందుకు ఆయా పరీక్షల నిర్వహణ సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విమర్శలు తప్పడం లేదు. లీకుల దెబ్బకు కేంద్ర ప్రభుత్వం సైతం ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి జాతీయ స్ధాయిలో ప్రవేశ పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇకపై మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలకు అపార్ ఐడీ తప్పనిసరి కానుంది.

ఈసారి నీట్ యూజీ పరీక్ష రాసే అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్, పరీక్షా ప్రక్రియ సమయంలో వారి అపార్ ఐడీని, అప్‌డేట్ చేసిన ఆధార్‌ని ఉపయోగించాల్సిందిగా జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ సూచిస్తోంది. అంటే ఇప్పటివరకూ అపార్ ఐడీ లేని వారు సైతం రిజిస్టర్ చేసుకుని దీని నంబర్ ను కచ్చితంగా పొందాల్సి ఉంటుంది. అప్పుడే రిజిస్ట్రేషన్ తో పాటు పరీక్షలకు ప్రవేశం కూడా లభిస్తుంది. లేకపోతే చిక్కులు తప్పవు.
2020 కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం కేంద్రం 'వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి' కార్యక్రమంలో భాగంగా అపార్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డ్ లాగా, దేశం అంతటా ప్రతి విద్యార్థికి ప్రత్యేక 12 అంకెల గుర్తింపు సంఖ్య ఇస్తున్నారు. వారి అకడమిక్ క్రెడిట్స్ ను ఒకే చోట ఉంచడం ద్వారా విద్యార్ధులు, తల్లితండ్రులతో పాటు విద్యావేత్తలకు ఈ సమాచారం అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యం. ఇప్పుడు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఈ సమాచారం పొందాలనుకుంటోంది.
అయితే మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం ఎన్టీఏ అపార్ ఐడీని ఎందుకు తప్పనిసరి చేస్తోందంటే.. ఇప్పటికే వీటిలో జరిగిన లీకులతో మొత్తం వ్యవస్థ మీదే నమ్మకం సడలుతోంది. దీంతో వీటిని తప్పనిసరి చేస్తోంది.












Click it and Unblock the Notifications