మెడికల్ పీజీ అడ్మిషన్లపై ఎన్ఎంసీ కీలక నిర్ణయం-ఫీజు చెప్పాల్సిందే- ఆన్ లైన్ కౌన్సెలింగ్ లోనే సీటు..
దేశవ్యాప్తంగా పీజీ మెడికల్ కాలేజీల ప్రవేశాల్లో జరుగుతున్న అక్రమాల నియంత్రణకు జాతీయ వైద్య కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఇక ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తారు. అలాగే ఇందుకోసం ప్రతీ కాలేజీ ప్రతి కోర్సుకు ముందుగా ఫీజులను ప్రకటించాల్సి ఉంటుంది. ఏ కాలేజీ కూడా సొంతంగా అభ్యర్థులను చేర్చుకోవడం కుదరదని జాతీయ వైద్య కమిషన్ తేల్చిచెప్పేసింది.
జాతీయ మెడికల్ కమిషన్ తాజాగా పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్, 2023ని నోటిఫై చేసింది. దీని ప్రకారం అన్ని పీజీ సీట్లకు అన్ని రౌండ్ల కౌన్సెలింగ్ ఆన్‌లైన్ మోడ్‌లో రాష్ట్ర లేదా కేంద్ర కౌన్సెలింగ్ అధికారులచే నిర్వహించబడుతుందని తెలిపింది. దేశంలోని అన్ని వైద్య సంస్థలకు మెడిసిన్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి ఒకే కౌన్సెలింగ్ ఉంటుందని, అయితే ఇది కేవలం అర్హత పరీక్షల మెరిట్ లిస్ట్ ఆధారంగా నిర్వహిస్తామని ఎన్ఎంసీ చెబుతోంది.

మరోవైపు ప్రతీ పీజీ మెడికల్ కాలేజీ.. కౌన్సెలింగ్ సీట్ మ్యాట్రిక్స్‌లో కాలేజీలు వివరాలను నమోదు చేసేటప్పుడు ప్రతి కోర్సుకు ఫీజు మొత్తాన్ని పేర్కొనాలి. ఇందులో విఫలమైతే సదరు సీట్లను పరిగణనలోకీ తీసుకోబోమని ఎన్ఎంసీ తెలిపింది. అలాగే మెడికల్ పీజీ పరీక్షా విధానంలో కూడా కొన్ని మార్పులు చేస్తున్నారు. వీటిలో ఫార్మేటివ్ అసెస్‌మెంట్ , యూనివర్సిటీ పరీక్షలలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇది పరీక్షలో నిష్పాక్షికతను తీసుకురావడానికి, అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు ఉండటానికి ఈ మార్పులు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications