పాత గెస్ట్ లెక్చరర్లకు గుడ్‌న్యూస్: వారినే కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని తెలంంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత విద్యా సంవత్సరాల్లో నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించాలని ఆదేశించింది. జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల నియమానికి జులై 18న ఇంటర్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో గెస్ట్ లెక్చరర్లు పిటిషన్ దాఖలు చేశారు. తాజా నియామకాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిర్యాదులు లేని, అర్హులైన గెస్ట్ ఫ్యాకల్టీని ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఇంటర్ కమిషనరేట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది హైకోర్టు. కాగా, జులై 18న తెలంగాణ ఇంటర్ బోర్డు 1654 గెస్ట్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 19వ తేదీ నుంచి జులై 24 తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
అయితే, గెస్ట్ లెక్చరర్ల నోటిఫికేషన్‌పై గతంలో పనిచేసిన 1654 మంది గెస్ట్ లెక్చరర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించి కొత్తగా ఇంటర్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదంటూ వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ కావాలనే తమను తొలగించారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ ఆయూష్ విభాగంలో 156 కీలక పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో మరో వందకుపైగా ఉద్యోగాల భర్తీ కానున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయూష్ విభాగంలో 156 మంది వైద్యాధికారుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 54 మంది ఆయుర్వేద, 33 మంది హోమియో, 69 మంది యునానీ వైద్యాధికారులను నియమించనున్నారు.
ఆసక్తి, అర్హత ఉన్న వారు ఆగస్టు 7 నుంచి 22వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సేవల రిక్రూట్‌మెంట్ బోర్డ్ సూచించింది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, గతంలో ప్రభుత్వ సర్వీసులో అందించిన సేవలను నియామకానికి ప్రాతిపదికగా తీసుకోనున్నారు. గరిష్ట వయసు ఈ ఏడాది జులై ఒకటో తేదీనాటికి 44 ఏళ్లు ఉండాలి.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న 190 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ, డెంటల్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నవారికి పదోన్నతులు కల్పించారు.












Click it and Unblock the Notifications