తెలంగాణలో మహిళా టీచర్స్ డే- ఆమె త్యాగం, కృషికి గుర్తింపుగా..!
లింగ వివక్ష, కుల అసమానతలపై పోరాటం చేసిన సావిత్రీబాయిపూలే జయంతిని ఇకపై మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని వర్గాలకు స్ఫూర్తిదాయకమైన సావిత్రిబాయి ఫూలే జయంతిని ఏటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సావిత్రీబాయి విద్య ద్వారా మహిళా సాధికారతకు పునాది వేశారని, సమాజంలో మహిళా సమానత్వం కోసం పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
సావిత్రిబాయి ఫూలే ఆశయాలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. ఫూలే దంపతులు చేసిన సేవలను, సమాజహితం కోసం వారి త్యాగాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సావిత్రీబాయి భారతీయ సమాజంలో చారిత్రాత్మక మార్పుకు పునాది వేశారని తెలిపారు. మహిళా సమాజానికి విద్యను అందించడానికి, అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి ఆమె తన జీవితాంతం అంకితం చేశారని రేవంత్ పేర్కొన్నారు.

లింగ వివక్ష, కుల అసమానతలపై సావిత్రీబాయి చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తినిచ్చిందని తెలంగాణ సీఎం గుర్తు చేసుకున్నారు. సావిత్రీబాయి ఆశయ సాధనకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కోటి మంది మహిళలను లక్షాధికారులుగా ప్రోత్సహించే లక్ష్యంతో, మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అన్ని రంగాలలో మహిళా సంఘానికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నైపుణ్యాలను పెంపొందించడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

బీసీలు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఇంటింటి సమగ్ర సర్వేను పూర్తి చేసిందని సీఎం రేవంత్ తెలిపారు. మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు సావిత్రిబాయి ఫూలే కృషి చేశారన్నారు. ఆమె త్యాగం, కృషికి గుర్తింపుగా, ముఖ్యమంత్రి సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మహిళా ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications