బాలకృష్ణ-నాగార్జున మధ్య సయోధ్య.. అతనే రాయబారం
తెలుగు సినీ పరిశ్రమలో రెండు అగ్ర కుటుంబాల నుంచి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మధ్య కొన్ని సంవత్సరాల నుంచి సత్సంబంధాలు లేవు. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు మరణించిన సమయంలో కూడా పరిశ్రమ మొత్తం హాజరైనప్పటికీ బాలయ్య మాత్రం హాజరుకాలేదు. అంతగా వారి మధ్య విభేదాలుండేవి. అందుకు కారణం ఏమిటనే విషయం బయటకు రాకపోయినప్పటికీ సినీ పెద్దలు పలువురు వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎంతో ప్రయత్నించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య-నాగార్జున మధ్య సయోధ్య కుదిరినట్లు తెలిసింది.
వీరిద్దరికీ ఆత్మీయుడైన వ్యక్తి రాయబారం
వీరిద్దరికీ ఎంతో ఆత్మీయుడైన వ్యక్తి విశ్వప్రయత్నం చేసి వీరిద్దరినీ కలిపినట్లు తెలుస్తోంది. బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో మూడో సీజన్ అక్టోబరులో ప్రారంభం కాబోతోంది. ఈ షోకు సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించే యోచనలో బాలయ్య ఉన్నారు. నాగార్జున ప్రస్తుతం ధనుష్ తో కలిసి కుబేర సినిమా చేస్తున్నారు. దీనికి శేఖర్ కమ్ముల దర్శకుడు. త్వరలోనే కుబేర బృందం మొత్తం అన్ స్టాపబుల్ షోకు హాజరుకాబోతోంది. వీరిని తీసుకొని ప్రచారం కోసం నాగార్జున వస్తున్నట్లు సమాచారం. మొత్తానికి కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసిపోవడంపై ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నాగేశ్వరరావుకు నివాళి కోసం బాలయ్య వెళితే బాగుండేది
ఈ షోకు అగ్ర కథానాయకుడు చిరంజీవి కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏ హీరోకు సంబంధించి మందుగా ఇంటర్వ్యూ చేసి ప్రోమోను విడుదల చేస్తారో చూడాలి. బాలయ్య, నాగార్జున మధ్య సయోధ్య కుదిర్చిన వ్యక్తి ఎవరా అనే చర్చ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నడుస్తోంది. పేరు పూర్తిగా బయటకు రానప్పటికీ ఆయన వీరిద్దరికీ ఎంతో ఆత్మీయుడని, ఆయన మాటకు ఈ ఇద్దరు హీరోలు ఎంతో గౌరవం ఇస్తారని, అందుకే ఆయన మాటను కాదనలేక విభేదాలు మరిచిపోయి ఇద్దరు అగ్ర హీరోలు కలిసిపోతున్నట్లు తెలుస్తోంది. కొంత ముందరే ఈ పరిణామం జరిగివుంటే బాగుండేదని, సినీ పరిశ్రమకు రెండు కళ్లల్లో ఒకరైన నాగేశ్వరరావు మృతిచెందినప్పుడు బాలయ్య వెళితే బాగుండేదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications