ఆ అవార్డును విసిరి అందులో పడేశా: చిరంజీవి
డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఇండియన్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. అమితాబ్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకోవడం తనకు జీవితంలో మరిచిపోలేని అనుభవమని చిరంజీవి అన్నారు. ఇటీవలే చిరుకు పద్మవిభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఐఫా వేదికపై ప్రత్యేకమైన గౌరవం దక్కింది. ఈ రెండు ఇలా ఉండగానే అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఓ వివాదాస్పద అంశాన్ని చిరంజీవి తెరపైకి మరోసారి తీసుకువచ్చారు.
అర్హత వచ్చినప్పుడే తీసుకోవాలనుకున్నా
ఖైదీ సినిమాతో కెరీర్ మలుపు తిరిగిన తర్వాత చిరంజీవి అనేక అవార్డులను అందుకున్నారు. అందులో వజ్రోత్సవానికి సంబంధించిన అవార్డు కూడా ఉంది. అయితే ఆ అవార్డును తీసి పక్కన పడేశాను అంటూ గతంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ తనను వజ్రోత్సవ అవార్డుతో సత్కరించాలని అనుకుందని, ఆ విషయం తనకు చెప్పినప్పుడు ఎంతో సంతోషానికి గురయ్యానన్నారు. అవార్డును అందుకున్నప్పుడు కొందరు విమర్శించారని, దీంతో చాలా బాధ కలిగి దాన్ని టైం క్యాప్సిల్స్ లో పడేశానన్నారు. ఆ అవార్డును అందుకోవడానికి ఎప్పుడైతే తనకు అర్హత వస్తుందో అప్పుడే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నారు.

రచ్చ గెలిచి ఇంట గెలిచాను
మన పెద్దలు ఇంట గెలిచి రచ్చ గెలవమని చెబుతుంటారు కానీ తాను అక్కినేని నాగేశ్వరరావు అవార్డును అందుకుంటున్నప్పుడు రచ్చ గెలిచి ఇంటి గెలిచినట్లుగా అనిపించిందని చిరంజీవి చెప్పారు. తన స్నేహితుడు, తన ఫిలసఫర్ నాగార్జున స్వయంగా వచ్చి ఈ అవార్డును అందుకోవడానికి మీరే అర్హులని చెబితే తాను ఎంతో సంతోషించానని, ఇంట కూడా గెలిచానని అనుకున్నానన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అనేదిన తనకు ఇంటిలాంటిదని, అందులోని ఉండేవారంతా తన కుటుంబ సభ్యులేనని, కుటుంబ సభ్యులే స్వయంగా పిలిచి గౌరవించడం అంటే తాను అర్హత సాధించినట్లేనన్నారు.
తనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ తోపాటు ఎన్నో అవార్డులు దక్కినప్పటికీ ఈ అవార్డు మాత్రమే చాలా ప్రత్యేకమైందని చిరంజీవి వ్యాఖ్యానించారు. వజ్రోత్సవాల సమయంలో చిరంజీవికి అవమానం జరిగింది. వేదికపైనే మోహన్ బాబు చిరును అవమానించారు. చిరుకంటే తానే ఎక్కువ సినిమాలు చేశానని, పరిశ్రమలో చిరుకంటే గొప్పవారు ఎంతోమంది ఉన్నప్పటికీ ఆయనకే ఎందుకు అవార్డు ఇస్తున్నారని, అర్హులైనవారికి ఎందుకు ఇవ్వడంలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications