ఒకే వేదిక పైకి చిరు, బాలయ్య , నాగ్, వెంకీ.. ఫ్యాన్స్‌కి బంపర్ బొనాంజా !
తెలంగాణ ప్రభుత్వం దాదాపు పదకొండేళ్ల తర్వాత నంది అవార్డులను ప్రకటించింది. ఈసారి "గద్దర్ అవార్డులు" పేరుతో అవార్డులను ప్రదానం చేయనున్నారు. కళారంగంలో అత్యంత ప్రతిభ కనపరిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సహా పలు విభాగాల్లో అవార్డులు అందిస్తుంది.
ఈరోజు ( జూన్ 14, 2025 ) హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రధానోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. 2024కు పలు విభాగాల్లో అవార్డులను అనౌన్స్ చేశారు. అలానే 2014 నుంచి 2023 మధ్య వచ్చిన సినిమాలకు ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డులు ప్రకటించారు.

రీసెంట్ గానే గద్దర్ అవార్డుల జ్ఞాపికను ప్రభుత్వం విడుదల చేసింది. జ్ఞాపికలో చేతికి రీల్ చుట్టుకున్నట్లుగా ఉండి.. పైన చేతిలో డప్పు పట్టుకున్నట్లుగా ఉంది. ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించారు. కాగా గద్దర్ గుర్తుగా డప్పును ముద్రించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా ఈ చిహ్నాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.
ఈ వేడుకకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సినీ పరిశ్రమ ప్రముఖులు హాజరుకానున్నారు.
అయితే గత కొన్నిరోజుల నుంచి గద్దర్ అవార్డుల కార్యక్రమం కోసం టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు సైతం ఇప్పటికే అందించారు. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు సైతం ఈ వేడుకలో పాలుపంచుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా చాలా కాలం తర్వాత నాలుగు మూల స్తంబాలుగా చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకే వేదికపై కనిపించనున్నట్టు సమాచారం.

హీరోల పరంగా ఎవరి అభిమానులు వారికి ఉన్నప్పటికీ.. నలుగురిని కలిసి ఒకే వేదికపై చూస్తే ప్రేక్షకులకు ఆ సీన్ ఒక కన్నుల పండగ అని చెప్పొచ్చు. దీంతో ఈ వేడుక కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే గతంలో నంది అవార్డుల కంటే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచింది తెలంగాణ సర్కార్. అవార్డుల్లో భాగంగా మొత్తం 73 పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అందించనుండగా.. ఇందుకోసం ప్రభుత్వం రూ. 4.5 కోట్లు ఖర్చు చేయనుందని సమాచారం. ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారంతోపాటు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ లభించనుంది. అలాగే వ్యక్తిగత అవార్డుల్లోనూ ఒక్కో పురస్కారానికి రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు చొప్పున నగదు అందనుంది. అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు రూ. 10 లక్షల ప్రోత్సాహక నగదు లభించనుంది.












Click it and Unblock the Notifications