వీవీ వినాయక్ ఒక్క మాటతో పెరిగిన అంచనాలు.. ‘ధర్మస్థల నియోజకవర్గం’పై ఫుల్ బజ్!
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'ధర్మస్థల నియోజకవర్గం'. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
'ధర్మస్థల నియోజకవర్గం' గొప్ప సినిమా అవుతుంది - వీవీ వినాయక్
ఈ కార్యక్రమంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ.. గేయ రచయిన చంద్రబోస్ ఈ సినిమా గురించి తనకు వివరించారని వెల్లడించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేలా డైరెక్టర్ జ్ఞాన ప్రభ ఈ సినిమాను తెరకెక్కించారని.. కథ బాగా నచ్చడంతో చంద్రబోస్ రూపాయి కూడా తీసుకోకుండా పాటలన్నీ రాశారని చెప్పారు. తన తొలి చిత్రం 'ఆది'కి చంద్రబోస్ తొలి పాట రాశారని.. అలాగే జ్ఞాన ప్రభ మొదటి సినిమాకు కూడా ఆయనే లిరిక్స్ అందించారని గుర్తుచేసుకున్నారు. 'ఆది' తరహాలోనే ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

'రంగస్థలం' తర్వాత ఆ స్థాయిలో రాశాను: ఆస్కార్ విజేత చంద్రబోస్
లిరిక్ రైటర్ గా ఈ సినిమా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆస్కార్ విజేత చంద్రబోస్ అన్నారు. రంగస్థలం తర్వాత అంత సంతోషంగా ఈ సినిమాలోని 5 పాటలను రాశానని వెల్లడించారు. సమాజంలో ప్రతి ఒక్కరిలో ఉండే మంచి, చెడుల మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథాంశమని వివరించారు. సంగీత దర్శకుడు మహావీర్ అద్భుతమైన ట్యూన్స్ అందించారని.. వాటిలో న్యాయం చేయరా దేవుడా, ధర్మో రక్షతి రక్షిత:, ఆరంభం, కొడుకో కొడుకో, కాలం ..ఇలా ఐదు పాటలు ఆకట్టుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ - కొత్త దర్శకులు కథ బాగా చెప్పినా అది రూపొందించడంలో ఎక్కడో మిస్టేక్స్ చేస్తుంటారని.. కానీ జ్ఞాన ప్రభ మంచి కథను అంతే బాగా తెరకెక్కించారని తెలిపారు. ఈ రోజు యువత చూడాల్సిన చిత్రమిది అంటూ వెల్లడించారు. డ్రగ్స్ గురించి ఇప్పుడు జరుగుతున్నవి ముందే ఊహించి ఈ సినిమాలో జ్ఞాన ప్రభ తెరకెక్కించారని చెప్పుకొచ్చారు. సీనియర్ నటుడు సత్యప్రకాష్ తన కుమారుడు నటరాజ్ హీరోగా పరిచయం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేయగా.. సీనియర్ నటుడు సాయికుమార్ ఈ చిత్రంలో తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపారు. నటి కస్తూరి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రతో ఆకట్టుకోనున్నారు.
సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్
ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి మెసేజ్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుగా ఈ సినిమాను రూపొందించామని దర్శకుడు జ్ఞాన ప్రభ వెల్లడించారు. నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ.. ప్లానింగ్ ప్రకారం వర్కింగ్ డేస్ పెరగకుండా అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేశామని, సెప్టెంబర్ 4న పీవీఆర్, ఐనాక్స్ ద్వారా సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. కామన్ మ్యాన్ కోసం రూపొందించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని హీరో నటరాజ్ కోరారు.














Click it and Unblock the Notifications