టాలీవుడ్ బోల్డ్ కల్ట్ క్లాసిక్.. 'ఆరుగురు పతివ్రతలు' మళ్లీ వస్తుందిరోయ్!
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత కాలపు బ్లాక్ బస్టర్ హిట్లు, ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ సినిమాలను నూత 4కే టెక్నాలజీతో మళ్లీ థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో పాటు వినూత్నమైన కంటెంట్‌తో వచ్చిన సినిమాలకు కూడా నేటి తరం అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా రెండు దశాబ్ధాల క్రితం తన బోల్డ్ అండ్ రియలిస్టిక్ కంటెంట్‌తో టాలీవుడ్‌లో పెద్ద సెన్సేషన్ సృష్టించిన కల్ట్ క్లాసిక్ మూవీ 'ఆరుగురు పతివ్రతలు'మళ్లీ థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది.
ఈవీవీ సత్యనారాయణ ముందుచూపుతో తీసిన సినిమా
దివంగత ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తన సొంత నిర్మాణ సంస్థ "ఈవీవీ సినిమా" బ్యానర్‌పై ఈ సినిమాను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. 2004 ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమా అప్పట్లో తన విభిన్నమైన పోస్టర్లు, బోల్డ్ కథాంశంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు సరిగ్గా 22 ఏళ్ల తర్వాత పోచమ్మ ఫిల్మ్స్ సమర్పణలో అక్టోబర్ 29న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు.

కథ
ఆరుగురు చిన్ననాటి స్నేహితురాళ్లు తమ వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న అనుభవాలు, భర్తల నైజాలు, సంసారంలో తలెత్తే ఆటుపోట్లను ఒకరితో ఒకరు పంచుకోవడం చుట్టూ ఈ కథ సాగుతుంది. పెళ్లి వ్యవస్థలో మహిళలు ఎదుర్కొనే మానసిక సంఘర్షణలు, భర్తల అనుమానాస్పద ధోరణి, నిర్లక్ష్యం వల్ల కాపురాల్లో వచ్చే పరిణామాలను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ అత్యంత సహజంగా తెరకెక్కించారు. దాంపత్య జీవితంలోని ఈగోలను, మోసాలను హాస్యభరితంగా చూపిస్తూనే ఆలోచింపజేసేలా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
జెన్-జీ అభిమానులకు కనెక్ట్ అయ్యే అంశాలు
20 ఏళ్ల క్రితమే డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఎంతో ముందుచూపుతో ఆధునిక కుటుంబ జీవితాల్లో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యలను, మానవ సంబంధాల లోతులను ఆవిష్కరించారు. నేటితరం దాంపత్యాల్లోనూ కనిపించే అనేక అంశాలు ఈ సినిమాలో ఉండటంతో ప్రస్తుత జెన్-జీ యువతకు కూడా ఈ కంటెంట్ సులభంగా కనెక్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పాతతరం జ్ఞాపకాలను రీ-క్రియేట్ చేస్తూ అక్టోబర్ 29న థియేటర్లలోకి వస్తున్న ఈ 'ఆరుగురు పతివ్రతలు' మళ్లీ ఏ స్థాయి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.














Click it and Unblock the Notifications
