'గుంటూరు కారం' బిజినెస్.. ఒక రేంజ్ లో ఉంది
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు దీన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది.
చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ కావడం, 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి, ధమ్ మసాలా సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. దీనిపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగినట్లు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 'గుంటూరు కారం' వంద కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.50 కోట్లు, సీడెడ్ లో రూ.15 కోట్ల చొప్పున రూ.110 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ.30 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు టాక్ వస్తోంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే రూ.140 కోట్లకు పైగా షేర్ తెచ్చుకోవాలి. హిట్ టాక్ వస్తే మహేష్ వంటి స్టార్ కి సంక్రాంతి సీజన్ లో రూ.140 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద విషయమేమి కాదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications