సైకిల్ గుర్తుకే మన ఓటు: సమంత
ఏపీలో కొద్దిరోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీతో తెలుగుదేశం-జనసేన కూటమి హోరాహోరీగా తలపడబోతోంది. బీజేపీ కూడా కలిసివస్తే ఈ మూడు పార్టీల కూటమికి, వైసీపీ మధ్య మహా సంగ్రామం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న వైసీపీని నిలవరించడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడుతుందా? అనే ఉత్కంఠ ఏపీ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
ఇటువంటి తరుణంలోనే కథానాయిక సమంతకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన సమంత అభిమానులతోపాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. అభివృద్ధికి మీ ఓటు కాబట్టి సైకిల్ గుర్తుకే ఓటేయాలని సమంత చెబుతోంది. దీనిపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. సమంత తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరిందా? అని ప్రశ్నించుకుంటున్నారు. అయితే టీడీపీకి మద్దతుగా సమంత చెబుతున్న వీడియో ఇప్పటిది కాదు. 2019 ఎన్నికల సందర్భంగా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎన్నికల్లో పోటీచేస్తుండంతో వారికి మద్దతుగా ఈ వీడియోను విడుదల చేసింది.

2019లోనే ఈ వీడియో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. త్వరలోనే ఎన్నికలు జరగబోతుండటంతో మరోసారి ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రస్తుతం సమంత తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కథలను వింటోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది. దీనిద్వారా సరికొత్త టాలెంట్ ను పరిశ్రమకు పరిచయం చేయాలనే యోచనలో ఉంది. అభిమానులు మాత్రం తిరిగి నాగచైతన్యతో ఎప్పుడు కలిసిపోతుందా? అని ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications