జూనియర్ ఎన్టీఆర్-సూర్య మల్టీస్టారర్... డైరెక్టర్ ఎవరంటే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి ఏ ముహూర్తాన ఆర్ఆర్ఆర్ సినిమాతో మల్టీస్టారర్ ట్రెండ్ ను ప్రారంభించాడో అప్పటినుంచి ఈ తరహా సినిమాలు ఎక్కువవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో నటించిన తారక్ వార్ 2 చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రంలో మరో హీరో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ నటుడు సూర్యతో మరో మల్టీస్టారర్ చిత్రంలో తారక్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. కంగువ దాదాపుగా పూర్తికావొచ్చింది. ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సూర్య-ఎన్టీఆర్ కాంబినేషనల్ సినిమా నిర్మించేందుకు స్క్రిప్ట్ ను సిద్ధం చేయిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో తారక్ షేర్ చేసుకోబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు డైరెక్టర్ ఎవరనేది ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత దాన్నిబట్టి దర్శకుణ్ని ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరు దర్శకుల పేర్లు చర్చల్లో ఉన్నప్పటికీ దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.

తారక్, సూర్య లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తే రికార్డులు బద్ధలవడం ఖాయమని, నటనంటే వీరిద్దరి నుంచే చూడాలని, ప్రతి పాత్రను ఈ ఇద్దరు హీరోలు అద్భుతంగా పోషిస్తారని, దర్శకుడు తన సత్తానుబట్టి వీరిద్దరిని ఉపయోగించుకుంటే పాన్ ఇండియాస్థాయిలో ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. దర్శకుడెవరనేదానిపైనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాత్రం స్క్రిప్ట్ ఎంత పక్కాగా వస్తే అంత పక్కాగా దర్శకుణ్ని ఎంచుకోవాలనే యోచనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications