సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మహేష్‌బాబు, నమ్రత
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, అతని సతీమణి నమ్రత శిరోద్కర్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల వరదల వల్ల నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున మహేష్ బాబు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు నమ్రతతో కలిసి రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి విరాళం చెక్కును అందజేశారు. దీంతోపాటు ఏఎంబీ మాల్ తరఫున మరో రూ.10 లక్షలు అందజేశారు. ఈ రెండు చెక్కులను మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రికి వేర్వేరుగా అందజేశారు.
అభినందించిన రేవంత్ రెడ్డి
మహేష్ బాబుతోపాటు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా ఉన్నారు. ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వానికి అండగా నిలిచి తన ఔదార్యాన్ని చాటుకున్న మహేష్ బాబు దంపతులను రేవంత్ రెడ్డి అభినందించారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన మహేష్ బాబు కొత్త లుక్ లో కనపడ్డారు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రిన్స్ తన లుక్ ను మార్చుకుంటున్నాడు. ఈ లుక్ చేసినవారు ఏమున్నాడ్రా బాబూ.. హాలీవుడ్ హీరోలు కూడా సరిపోరంటూ కామెంట్స్ చేస్తున్నారు. పొడవుగా జుట్టు పెంచి, భారీగా పెరిగిన గడ్డంతో ఉన్న మహేష్ బాబు న్యూలుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

రూ.1500 కోట్ల బడ్జెట్ తో?
రాజమౌళి దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ, గోపాల్ రెడ్డి ఈ సినిమాను రూ.1500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ గా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. రెండు భాగాలుగా రాబోతోందంటున్నారుకానీ దీనిపై అధికారికంగా ధ్రువీకరణ రాలేదు. కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.












Click it and Unblock the Notifications