మహేష్ బాబు "వారణాసి" టీజర్ వచ్చేది ఎప్పుడంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న చిత్రం "వారణాసి". మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు ₹1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
కాగా రీసెంట్ గానే ఈ చిత్ర బృందం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా "గ్లోబ్ ట్రోటర్" పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు.. ఆధ్యాత్మిక అంశాలతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉండడంతో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచేస్తున్నారు జక్కన్న. రాజమౌళి సినిమాలకు ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ తరుణంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్స్‌కు రాజమౌళి ఒక మెగా ప్లాన్ సిద్ధం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" సినిమాలోని సాంగ్ ఆస్కార్ గెలుచుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి నుంచి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తో ఆయనకు మంచి స్నేహబంధం ఏర్పడింది.
అయితే ఇప్పుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో "అవతార్ 3: ఫైర్ అండ్ యాష్" రిలీజ్ కి రెడీ అయ్యింది. డిసెంబర్ 19 విడుదల కాబోతున్న ఈ చిత్రం.. అవతార్ సిరీస్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగానే అవతార్ 3 ప్రదర్శితం కాబోతున్న థియేటర్లలో "వారణాసి" మూవీ టీజర్‌ను ప్లే చేయనున్నట్టు సమాచారం. భారతదేశంతో పాటు ఎంపిక చేసిన కొన్ని దేశాలలో "అవతార్ 3" ఇంటర్వెల్ సమయంలో టీజర్ రిలీజ్ కి ప్లాన్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అరుదైన డీల్ కుదిరితే మహేష్ బాబు గ్లోబల్ స్టార్‌గా ఎదగడం పక్కా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications