టాలీవుడ్‌కి బిగ్ షాక్.. రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Federation) సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి ( ఆగస్టు 4, 2025 ) నుంచి టాలీవుడ్‌లో అన్ని సినిమా షూటింగ్‌లు, వెబ్ సిరీస్‌ల పనులు బంద్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 30 శాతం వేతనాలు పెంచాలన్న డిమాండ్‌కు స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
30 శాతం వేతన పెంపు డిమాండ్..
గత కొంతకాలంగా ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున 30 శాతం వేతనాలు పెంచాలి అనే డిమాండ్‌ను నిర్మాతల కౌన్సిల్‌కు తెలియజేస్తూ చర్చలు జరుగుతున్నాయి. కానీ అందుకు సంబంధించి సరైన నిర్ణయం రాకపోవడంతో తాము బంద్ కు పిలుపునిచ్చినట్టు చెబుతున్నారు. వేతన పెంపును అధికారికంగా రాతపూర్వకంగా ప్రకటించేవరకు షూటింగ్‌లకు హాజరు కావద్దని సభ్యులందరికీ ఆదేశించింది.

అన్ని రకాల షూటింగ్‌లపై ప్రభావం..
ఈ నిర్ణయం వల్ల కేవలం సినిమాలకే కాకుండా.. వెబ్ సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్, ప్రకటనలు, టీవీ ప్రోగ్రాంల షూటింగ్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా కానీ ఆ ప్రాజెక్టు టాలీవుడ్ పరిధిలో ఉంటే ఈ నిర్ణయం అమలులో ఉండనుంది.
ఎవరు అయినా వ్యక్తిగతంగా షూటింగ్‌లో పాల్గొన్నా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సంఘం ఒక్కటిగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఏ ఒక్క ఉద్యోగి కూడా నిర్మాతల ఒత్తిళ్లకు లోనవ్వకుండా సంఘానికి భంగం కలిగించకూడదని తెలియజేసింది. ఈ సమ్మెతో ఇప్పటికే షూటింగ్ జరుపుతున్న పలు పెద్ద సినిమాల షూటింగ్ షెడ్యూళ్లు వాయిదా పడే అవకాశముంది.
అయితే అనూహ్యంగా టాలీవుడ్‌లో షూటింగ్ నిలిచిపోతే నష్టాలు అధికంగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండగా, ఈ సమ్మె మరో పెద్ద అడ్డంకిగా మారనుంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications