సినిమాల విషయం ఏమిటని పవన్ కల్యాణ్ ను అడిగిన చంద్రబాబు?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ చాలా బిజీగా ఉంటున్నారు. సినిమాల్లో కథానాయకుడిగా రాణిస్తున్న పవర్ స్టార్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేకి బయట నుంచి మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. తిరిగి 2024 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేయడంద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ ను మట్టికరిపించారు. పోటీచేసిన 21 నియోజకవర్గాల్లోను జనసేన విజయఢంకా మోగించింది. దీంతో దేశం మొత్తం పవన్ కల్యాణ్ వైపు చూసింది.
ఉస్తాద్ భగత్ సింగ్ లేనట్లే
ఎన్నికల సమయానికి పవన్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు చేస్తున్నారు. వాటితోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒప్పుకున్నారు. అయితే బిజీ షెడ్యూల్ తో ఈ సినిమాలకే కాల్‌షీట్లను కేటాయించలేకపోతున్న పరిస్థితి ఉంది. దీంతో కొత్త సినిమాలను ఒప్పుకునే పరిస్థితే కనపడటంలేదు. పూర్తిగా రాజకీయాలకే అంకితమవుదామనుకుంటున్న పవన్ ఎలాగోలా హరిహర వీరమల్లును దాదాపు పూర్తిచేయించే స్థితికి తీసుకువచ్చారు. బాగా ఆలస్యం అవుతుండటంతో దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మార్చి 28వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.

అభిమానులకు మింగుడు పడని వార్త
సుజిత్ దర్శకత్వంలో తనకిష్టమైన సబ్జెక్ట్ అయిన గ్యాంగ్ స్టర్ పాత్రతో ఉన్న ఓజీ సినిమాను ఎన్నికలకు ముందే ఎంతో వేగంగా 50 శాతం మేరకు పూర్తిచేశారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనికి కాల్షీట్లు కేటాయించడం కష్టమవుతోంది. హరిహర వీరమల్లు విడుదలైన తర్వాత ఓజీకి కాల్షీట్లు కేటాయించి సెప్టెంబరులో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ లేనట్లే అని భావిస్తున్నారు. దీంతో ఓజీ సినిమానే పవన్ కల్యాణ్ చివరి సినిమా కాబోతోంది. ఈ విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. సనాతన ధర్మంపై దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయాల్సిన బాధ్యతలున్నాయి. దీంతో పవర్ స్టార్ ను ఇకనుంచి తెరపై చూడటం కష్టమనే అభిప్రాయం వినవస్తోంది. అభిమానులకు మాత్రం ఇది మింగుడు పడని వార్త అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications