ధురంధురుడితో పవన్ కళ్యాణ్.. టాలీవుడ్‌లో క్రేజీ 'డ్రీమ్ ప్రాజెక్ట్'?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పూర్తిగా రాజకీయాలపైనే తన దృష్టిని కేంద్రీకరించినప్పటికీ.. ఆయన చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో, అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌కు భారతీయ సినిమాలో పెరుగుతున్న జాతీయతా చిత్రాల ప్రజాదరణ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమిస్తూ.. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సినిమా తనకు చాలా నచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆదిత్య ధర్ రచయితగా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'బారాముల్లా' చిత్రాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
పవన్ కళ్యాణ్ మూమూలుగానే ఈ కామెంట్స్ చేసినప్పటికీ.. సినీ అభిమానులు మాత్రం దీని వెనుక ఏదైనా క్రేజీ కాంబినేషన్ దాగుందా అనే చర్చ మొదలుపెట్టారు. దానికి బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం భారత చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఆదిత్య ధర్ ఒకరు. 'ధురంధర్' సినిమా భారీ విజయం సాధించడంతో ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. భారీ యాక్షన్ సీక్వెన్స్, బలమైన భావోద్వేగాలు, దేశభక్తి అంశాలను మేళవించి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీయగల దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ వంటి మాస్ లీడర్, ఆదిత్య ధర్ వంటి మేధావి దర్శకుడితో చేతులు కలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన అభిమానుల్లో మొదలైంది.

ఈ ఇద్దరి కాంబినేషన్ గనుక సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీతో కూటమి ఏర్పాటు చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో బలమైన జాతీయతా భావాలున్న ఇమేజ్‌ను కలిగి ఉన్నారు. ఆదిత్య ధర్ సినిమాలు కూడా సరిగ్గా ఇదే సిద్ధాంతాలు, దేశభక్తి నేపథ్యంతో సాగుతాయి. ఒకవేళ వీరిద్దరి కలయికలో జాతీయతా నేపథ్యం ఉన్న ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా కనుక వస్తే.. అది దేశంలోనే అత్యంత భారీ అంచనాలున్న లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్‌గా మారుతుంది. కొంతమంది అభిమానులైతే ఈ ప్రాజెక్ట్ గనుక కుదిరితే, 'ధురంధర్' సినిమా క్రియేట్ చేసిన బజ్ కంటే ఎక్కువ హైప్ రావడం ఖాయమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే ఈ క్రేజీ కాంబినేషన్ కార్యరూపం దాల్చడానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏపీ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనపై రాజకీయ బాధ్యతలు విపరీతంగా పెరిగాయి. గతంలో లాగా సినిమాలకు ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించడం ఆయనకు ఇప్పుడు అసాధ్యం. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్ తన సినిమాల్లో నటించే హీరోల నుంచి పూర్తి స్థాయి సమయాన్ని, అంకితభావాన్ని కోరుకుంటారు. పైగా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, పవన్ కల్యాణ్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లపై సంతకాలు చేయడం లేదు. రాజకీయాలు చూసుకుంటూ సినిమాలను పార్ట్-టైమ్‌గా చేయడం కుదరదని, సినిమాకు పూర్తి సమయం ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు.
ఈ కారణాల వల్ల ప్రస్తుతానికైతే పవన్ కల్యాణ్ - ఆదిత్య ధర్ కాంబో అనేది కేవలం అభిమానుల ఊహల్లోని 'డ్రీమ్ ప్రాజెక్ట్' మాత్రమే. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ స్వయంగా బాలీవుడ్ దర్శకుడి పనితనాన్ని బహిరంగంగా ప్రశంసించడం సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications