950 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో సంచలన రికార్డు
తెలుగు జానపద పాటలు ఇప్పుడు కేవలం పల్లెటూర్లకే పరిమితం కాలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని గ్లోబల్ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయి. ఏ మాత్రం భారీ బడ్జెట్, స్టార్ హీరోల హంగులు లేకపోయినా.. కేవలం పల్లెటూరి మట్టి వాసన ఉన్న సాహిత్యంతో కోట్లాది మంది మనసులను గెలుచుకుంటున్నాయి. సరిగ్గా ఇదే కోవలో యూట్యూబ్‌లో అసాధారణ రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతోంది ఒక తెలుగు ఫోక్ సాంగ్. అదే 'రాను బొంబాయికి రాను'. ప్రస్తుతం ఈ ఒక్క పాటే ఏకంగా దాదాపు 950 మిలియన్లకు పైగా వ్యూస్ (దాదాపు 95 కోట్లు) సాధించి ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది.
అసలు ఈ పాట క్రేజ్ ఏంటి?
"అద్దాలా మేడలున్నయే.. మేడల్లా మంచి చీరులన్నయే.. చీరంచూ రైకలున్నయే... కొనిపిస్తా నాతో బొంబాయ్ రాయే.. రాను... నే రాను.. బొంబాయికి రాను" అంటూ సాగే ఈ పాట ట్యూన్ సోషల్ మీడియా వినియోగదారులను కట్టిపడేసింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి యూట్యూబ్ షార్ట్స్ వరకు ఎక్కడ చూసినా ఈ పాటే మార్మోగుతోంది. తెలంగాణ పల్లెటూరి యాస, అచ్చమైన స్థానిక పదాలు, గుండెను తాకే సహజమైన సంగీతం ఈ పాటను వేరే లెవెల్‌కి తీసుకెళ్లాయి. పెళ్లిళ్లు, జాతరలు, కాలేజీ వేడుకలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు.

విజయానికి అసలు కారణాలు ఇవే
ప్రముఖ జానపద గాయకుడు, డ్యాన్సర్ రాము రాథోడ్ ఈ పాటకు సాహిత్యం అందించడంతో పాటు ఎనర్జిటిక్‌గా పాడారు. ఆయనతో పాటు సింగర్ ప్రభ గొంతు ఈ పాటకు ప్రాణం పోసింది. రాము రాథోడ్‌తో పాటు లిఖిత వేసిన ఫోక్ స్టెప్పులు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శేఖర్ కొరియోగ్రఫీ ఈ పాటను మరింత కలర్ఫుల్గా మార్చింది. కళ్యాణ్ కీస్ అందించిన బీట్స్ ప్రతి ఒక్కరి చేత కాళ్లు కదిలేలా చేశాయి.
కేవలం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు బడ్జెట్‌తో పల్లెటూరి సహజ వాతావరణంలో ఈ వీడియోను తెరకెక్కించారు. అంత తక్కువ ఖర్చుతో రూపొందిన పాట నేడు వందల కోట్ల వ్యూస్‌తో సినిమా పాటలనే వెనక్కి నెట్టడం విశేషం. మట్టిలోని ప్రతిభకు, అచ్చమైన జానపదానికి హద్దులు లేవని నిరూపిస్తూ.. 'రాను బొంబాయికి రాను' పాట తెలుగు ఫోక్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.














Click it and Unblock the Notifications
