Bullet Train: అద్భుత ఫీచర్లతో బుల్లెట్ రైలు-తొలిసారి ఇవన్నీ.! రైల్వే అప్డేట్..!
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు కలిగిన భారతీయ రైల్వే తన రూపురేఖల్ని వేగంగా మార్చుకుంటోంది. పాత డొక్కు కోచ్ ల స్ధానంలో వందే భారత్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ వంటి ప్రీమియం కోచ్ లు ఇప్పుడు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. వీటిని మరో లెవెల్ కు తీసుకెళ్తుందని భావిస్తున్న బుల్లెట్ రైలు (Bullet Train) కూడా బెంగళూరులో నిర్మాణం జరుపుకుంటోంది. వచ్చే ఏడాది కల్లా పట్టాలపైకి వస్తుందని భావిస్తున్న ఈ రైలు ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ కారిడార్ పై పరుగులు తీయనుంది. ఈ నేపథ్యంలో ఈ తొలి భారతీయ బుల్లెట్ రైలులో ఫీచర్లను రైల్వే తాజాగా వెల్లడించింది.
భారత ప్రభుత్వ సంస్థ బీఈఎంఎల్ ఈ బుల్లెట్ రైలును గంటకు గరిష్టంగా 280 కిలోమీటర్ల వేగంతో హైస్పీడ్ కారిడార్ పై పరుగులు తీయించేందుకు వీలుగా తయారు చేస్తోంది. అయితే రెగ్యులర్ గా మాత్రం గంటకు 249 కిలోమీటర్ల వేగంతో నడపాలని భావిస్తున్నారు. మొత్తం 8 కోచ్ లు ఉండే ఈ రైలులో 557 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం బెంగళూరులోని బీఈఎంఎల్ తయారీ కేంద్రంలో రైలు బాడీ షెల్ స్వ్కీజ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందులో రైలు బయటి నిర్మాణం తీవ్రమైన ఒత్తిడిని, బాహ్య శక్తుల్ని ఎంతవరకూ తట్టుకోగలదో పరిశీలిస్తారు. ముఖ్యంగా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతవరకూ దెబ్బతినకుండా ఉంటుందో పరిశీలిస్తున్నారు. వచ్చే ఏడాది మే- జూన్ కల్లా ఈ బుల్లెట్ రైలును అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ కారిడార్ పై 100 కి.మీ దూరంలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆగస్టులో అధికారికంగా ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటుకి తెస్తారు.

బుల్లెట్ రైలు ఇతర ఫీచర్లు చూస్తే.. ఇందులో దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు, బ్రెయిలీ లిపిలో సమాచారం తెలుసుకునే ఏర్పాట్లు ఉంటాయి. ఈ రైలులోని ఏడు కోచ్ లలో 3x2 సీటింగ్, అలాగే ఎగ్జిక్యూటివ్ కోచ్ లో 2x2 సీటింగ్ ఉంటుంది. రైలుకు రెండువైపులా డ్రైవర్ క్యాబిన్స్ ఉంటాయి. భవిష్యత్తులో రెండు 8 కోచ్ ల రైళ్లు కలిపి 16 కోచ్ లతో దీన్ని నడిపేలా డిజైన్ చేస్తున్నారు. బుల్లెట్ రైలులో తగినంత లెగ్ స్పేస్ తో సౌకర్యవంతంగా సీట్లు ఉంటాయి. రైల్లో ఎల్ఈడీ లైటింగ్, లగేజీ కోసం ఓవర్ హెడ్ ర్యాక్ లు, భారీ లగేజీ కోసం ప్రత్యేక స్టాండ్లు, మొబైల్, ల్యాప్ టాప్ ఛార్జింగ్ పవర్ సాకెట్లు, అత్యాధునిక బయో-డైజెస్టర్ టాయిలెట్లు, ప్రతీ సీటు వరుసకు సమీపంలో పెద్ద కిటికీలు, ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో సమాచారం అందించేలా ఎల్ సీడీ స్క్రీన్లు, వైఫై ఆధారిత ఇన్పోటెయిన్మెంట్ వ్యవస్థ, అత్యవసర పరిస్ధితుల్లో రైలు సిబ్బందితో మాట్లాడేలా టాక్ బ్యాక్ వ్యవస్థ, శబ్దాన్ని తగ్గించే సాంకేతికత, అత్యాధునిక ఏసీ, రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థలు ఉంటాయి. దీంతో ప్రయాణికులకు ప్రీమియం ఎక్స్ పీరియన్స్ లభించనుంది.














Click it and Unblock the Notifications
