రాప్తాడు ఘటన: క్రమంగా కోలుకుంటున్న గోపిక, నిందితుడి కాలు తొలగించిన వైద్యులు!
అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు హేమంత్ ను పట్టుకునే క్రమంలో అతను తప్పించుకు పారిపోయే ప్రయత్నం చేయటంతో పోలీసులు అతని కాళ్ళ లోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆపై అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అతని కుడి కాలును వైద్యులు తొలగించారు.
అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి తర్వాత అతడికి శస్త్రచికిత్స జరిగింది. మోకాలి పైవరకు కాలును తీసేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి తెలిపారు.పోలీసులు అతడిని పట్టుకునే క్రమంలో జరిపిన కాల్పులలో కుడి కాలికి రక్తప్రసరణ ఆగిపోయి కుళ్లిపోయింది. ఎడమ కాలి రక్తనాళాలు కూడా దెబ్బతినడంతో ఆ కాలికి కూడా సర్జరీ చేశారు.

ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్ నుంచి ఏఎంసీకి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. నిందితుడు హేమంత్ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.గత నెలాఖరులో రాప్తాడు జడ్పీ హైస్కూల్లో హేమంత్ చైన్సాతో పదో తరగతి విద్యార్థిని గోపికపై దాడి చేశాడు. స్నేహితురాలు లక్ష్మి అడ్డుకోబోయి తీవ్రంగా గాయపడింది. గోపికను బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని అధికారులు తెలిపారు. లక్ష్మి కూడా అనంతపురంలోనే చికిత్స పొందుతోంది. అయితే ఆమె ధైర్యానికి జాతీయ సాహస అవార్డుకు సిఫార్సు చేశారు. ఇదిలా ఉంటే రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక గోపిక ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుందని, బాలిక మాట్లాడుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
వైద్యులను సంప్రదించి తాజా పరిస్థితి తెలుసుకున్నామని చెప్పారు.వైద్యులు చెప్పిన ప్రకారం గోపిక ఒక్కో పదం మాట్లాడుతోంది. వైద్యుల పిలుపునకు స్పందిస్తోంది. హైఫ్లో ఆక్సిజన్ సాయాన్ని క్రమంగా తగ్గిస్తున్నారు. ముక్కు ద్వారా ఆహారం సజావుగా తీసుకుంటోంది. రక్తహీనత కారణంగా రక్తమార్పిడి చేశారు. అవయవాల కదలికలు, ఛాతీ వ్యాయామాల కోసం ఫిజియోథెరపీ ప్రారంభించనున్నారు. యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులతో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని, త్వరగా కోలుకోవాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications
