షాక్ ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం
గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ భారీ స్థాయిలో ఉద్యోగుల కోతకు సన్నాహాలు చేస్తోంది. సంస్థ నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వార్షిక వ్యయంలో దాదాపు 20 శాతం వరకు ఆదా చేయాలని వాల్ట్ డిస్నీ మేనేజ్మెంట్ నిర్ణయించింది. దీనిపై మేనేజర్లకు ఆదేశాలను సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది.. ప్రపంచవ్యాప్తంగా డిస్నీ నెట్‌వర్క్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ తాజా లేఆఫ్స్ ప్రభావం.. డిస్నీ థీమ్ పార్కులు, టెలివిజన్ ఛానెళ్లు, సినిమా స్టూడియోల వంటి విభాగాలపై పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబడిలో రెండంకెల వృద్ధిని సాధించినప్పటికీ.. ఉద్యోగాల కోతకే ప్రాధాన్యత ఇస్తోందా సంస్థ. ఆదాయంగా వచ్చిన మొత్తాన్ని సినిమా, టెలివిజన్ ప్రోగ్రామింగ్, టెక్నాలజీ, క్రూయిజ్ షిప్ వంటి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది.

ఇప్పటికే ఈ సంస్థ వేలాది ఉద్యోగాలను తొలగించిన విషయం తెలిసిందే.బిలియన్ల కొద్దీ డాలర్ల వ్యయాన్ని తగ్గించుకుంది. గతంలో జరిగిన తొలగింపుల వల్ల ఏబీసీ నెట్‌వర్క్, పిక్సర్, ఈఎస్‌పీఎన్, ఫిల్మ్ స్టూడియోతో పాటు ఎక్స్‌పీరియన్స్ విభాగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆ తర్వాత కూడా లేఆఫ్ కొనసాగింది. ఇటీవలే లీగల్, గ్లోబల్ అఫైర్స్ విభాగాలను కూడా పునర్వ్యవస్థీకరించింది. ఉద్యోగుల కోతతో పాటు వ్యయాన్నీ తగ్గించుకుంది.
డిస్నీ మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ చెందిన ఇతర ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు కూడా ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాయి. సాంప్రదాయ టెలివిజన్ నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ప్రకటనల ఆదాయం గణనీయంగా తగ్గడం, డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుదల మందగించడం ఈ రంగానికి ప్రధాన సవాల్ గా మారింది. ఈ ఆర్థిక ప్రతికూలతల వల్ల నెట్‌ఫ్లిక్స్, సోనీ పిక్చర్స్, పారామౌంట్, వార్నర్ బ్రదర్స్ వంటి టాప్ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.
మరోవైపు అమెజాన్, యాపిల్ వంటి సంస్థలు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్‌ల నుంచి వస్తున్న పోటీ.. సంప్రదాయ మీడియా కంపెనీల మనుగడను పరీక్షకు గురిచేస్తోంది. డిజిటల్ యూజర్ల అలవాట్లు వేగంగా మారుతుండటంతో, దానికి అనుగుణంగా తమ వ్యాపార నమూనాలను మార్చుకోవడం వినోద సంస్థలకు అనివార్యమైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతోంది వాల్ట్ డిస్నీ.













Click it and Unblock the Notifications
