కేజీఎఫ్ రికార్డుకే ఎసరు పెట్టిన రూ.3 కోట్ల చిన్న సినిమా!
రూ.3 కోట్ల అతిస్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ చిన్న కన్నడ సినిమా కర్ణాటక బాక్సాఫీస్ వద్ధ విధ్వంసం సృష్టిస్తోంది. ఆ చిన్న సినిమా పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యష్ నటించిన భారీ చిత్రం 'కేజీఎఫ్: ఛాప్టర్ 1" రికార్డులను కూడా అధిగమించిందనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 'ప్రేమద ఊరల్లి' అనే ఈ సినిమా థియేటర్లలో సాధించిన అద్భుతమైన వసూళ్లతో ఈ సరికొత్త మైలురాయిని చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొన్ని బాక్సాఫీస్ ట్రేడ్ వెబ్‌సైట్ల సమాచారం ప్రకారం.. 'ప్రేమద ఊరల్లి' సినిమా కర్ణాటకలో దాదాపు రూ.135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇది గతంలో 'కేజీఎఫ్: ఛాప్టర్ 1" కర్ణాటకలో సాధించిన రూ.134 కోట్ల వసూళ్లను దాటేసినట్లు చెబుతున్నారు. అయితే వివిధ ట్రాకింగ్ వేదికల మధ్య ఈ బాక్సాఫీస్ లెక్కలలో తేడాలు ఉన్నందున ఈ రికార్డుపై ఇంకా ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు.

మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ కుటుంబ కథా చిత్రంలో శ్రీ రామ్, రంగయాణ రఘు, తపస్విని పూణచ్చ, రమికా శివు ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన పాజిటివ్ టాక్‌తో పుంజుకుని, పరిమిత బడ్జెట్‌తో వచ్చి ఊహించని సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ఈ సినిమాను అక్టోబర్ 2న తెలుగులో 'ప్రేమనే ఊరిలో' పేరుతో విడుదల చేశారు. అయితే కర్ణాటకలో వచ్చిన భారీ స్పందనతో పోలిస్తే తెలుగు మార్కెట్లో దీనికి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఈ ప్రచారంలో ఉన్న కర్ణాటక బాక్సాఫీస్ గణాంకలు నిజమైతే.. కేజీఎఫ్ 1 సినిమాను వెనక్కి నెట్టి ఆ రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన అతిపెద్ద సినిమాల్లో ఒకటిగా 'ప్రేమద ఊరళ్లి' నిలుస్తుంది. ప్రస్తుతానికి ఈ కలెక్షన్లను అధికారిక సంఖ్యలుగా కాకుండా కేవలం ట్రెడ్ వర్గాల అంచనాలుగా మాత్రమే పరిగణించాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
