సింపుల్‌గా రూ.500 పెట్టుబడితో రూ.5 కోట్లు సంపాదించిన శోభన్ బాబు!
సినిమా రంగంలో సంపాదించడం ఒక ఎత్తైతే, ఆ సంపాదనను సరిగ్గా దాచుకుని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు కేవలం వెండితెరపై నటుడిగానే కాకుండా, అద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణ కలిగిన దార్శనికుడిగానూ పరిశ్రమలో ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన పాటించిన ఆర్థిక సూత్రాలు, పొదుపు చిట్కాలే తర్వాతి తరం నటులను కోటీశ్వరులుగా మార్చాయి. శోభన్ బాబు ఆర్థిక వ్యూహాలు, ఆయన ఇచ్చిన అమూల్యమైన సలహాల గురించి సీనియర్ నటుడు, వ్యాపారవేత్త మురళీ మోహన్ ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఎకరం పొలం రూ.500, 20 ఏళ్లలో రూ.5 కోట్లు
"సంపాదన ఎంత అనేది కాదు, దానిని ఎలా మదుపు చేస్తున్నామన్నదే ముఖ్యం" అనేది శోభన్ బాబు నమ్మే బలమైన సూత్రం. మనుషుల జనాభా పెరుగుతుంది కానీ, భూమి పరిమాణం పెరగదు.. అందుకే భూముల్లో పెట్టే పెట్టుబడి ఎప్పటికీ నష్టపోదని ఆయన విశ్వసించేవారు. అప్పట్లో చెన్నైకి సమీపంలో ఎకరం కేవలం రూ.500కే కొనుగోలు చేసి వదిలేసేవారని, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ భూముల విలువ ఎకరాకు రూ.5 కోట్లకు పైగా పెరిగిందని మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు. చెన్నైతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆయన చేసిన వ్యూహాత్మక భూముల కొనుగోళ్లే ఆయనను అపారమైన సంపన్నుడిగా నిలిపాయి.

అడంబరాలు లేని సాధారణ జీవితం
ఎంత సంపాదించినా శోభన్ బాబు ఎప్పుడూ లగ్జరీలకు పోలేదు. రూపాయిని బీరువాలో దాచి పెట్టకుండా భూములపై మదుపు చేసేవారు. నిత్యం తెల్లటి దుస్తుల్లోనే కనిపిస్తూ ఎంతో సాధారణ జీవనం గడిపేవారు. మురళీ మోహన్ మాటల్లో చెప్పాలంటే.. "నేను ఈ రోజు రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాల్లో ఈ స్థాయిలో ఉండటానికి శోభన్ బాబు గారే ప్రేరణ. నా కెరీర్ ప్రారంభంలో ఒక సినిమాకు రూ.1,000 పారితోషికం తీసుకుంటున్న రోజుల్లోనే, ఆయన సలహాతో చెన్నై టి.నగర్‌లో రూ.50,000తో 11,000 చదరపు అడుగుల ఇల్లు కొన్నాను. ఈ రోజు దాని విలువ రూ.50 కోట్లకు పైగా ఉంది" అని మురళీ మోహన్ తెలిపారు. డబ్బును వృథాగా ఖర్చు పెట్టకుండా, దాంతో మరిన్ని ఆదాయ మార్గాలను సృష్టించాలనే శోభన్ బాబు సూత్రం నేటి తారలకు, యువతకు ఎంతో ఆదర్శనీయమని ఆయన కొనియాడారు.














Click it and Unblock the Notifications
