Fact Check: ఏపీలో పథకాల అమలుపై చేతులెత్తేశారా ? సర్కార్ క్లారిటీ ఇదే...!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాల అమలు విషయంలో వెనుకబడింది. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే పథకాల అమలులో దూకుడు కనిపించడం లేదు. కేవలం పెన్షన్ల పెంపు హామీని మాత్రమే ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం అమలు చేసింది. ఈ నేపథ్యంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సీఎం చంద్రబాబు పథకాల అమలు విషయంలో కొన్ని ప్రత్యక్ష, మరికొన్ని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పడం తనకు ఇష్టం లేదని, ఉన్న పరిస్ధితి చెప్పేస్తున్నానంటూ రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని కుండబద్దలు కొట్టారు.
అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కుదురుకున్నాకే అమలు చేస్తామంటూ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో పథకాల అమలుపై ప్రభుత్వం చేతులెత్తేసిందన్న ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని నీతి ఆయోగ్ రిపోర్ట్ సాయంతో వివరిస్తూ.. ఇంకా అప్పులు చేసే పరిస్ధితి లేదని, అలాగని ప్రజలపై పన్నులు విధించబోమని చెప్పేశారు. ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్ధిక పరిస్ధితి మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా అర్ధం చేసుకుని సహకరించాలని కోరారు.

దీంతో చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయలేనని చేతులెత్తేశారంటూ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టత ఇచ్చింది. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయలేం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వ్యక్తులు చేస్తున్న ఈ ప్రచారం అబద్దం అంటూ ప్రభుత్వం తెలిపింది.
దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడారు తప్ప, పథకాలు అమలు చేయలేం అని ఎక్కడా చెప్పలేదని ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరింది.













Click it and Unblock the Notifications