లాస్ట్ రిసార్ట్.....
హైదరాబాద్‌ః షాపింగ్ వెళ్లుతున్నారా, జాగ్రత్త. ఫ్రీ గిఫ్ట్ ఆకర్షణలకు లొంగిపోయారా అయిపోయినట్టే. ఈ మధ్య హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వున్న మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి, నియో రిచ్ కుటుంబాలు చిత్రమైన అనుభవాన్ని ఎదుర్కుంటున్నాయి.
ఓ ఫైన్ మార్నింగ్ లేదా ఈవెనింగ్ ఎక్కడినుంచో ఒక ఫోన్ వస్తుంది. హస్కీ వాయిస్ హాయ్ అని పలకరిస్తుంది. గుడ్ న్యూస్ అని ఊరిస్తుంది. చెప్పుకొండి చూద్దాం అని కొంటెగా కవ్విస్తుంది. అయోమయంలోంచి తేరుకునే లోపునే మీకు మంచి గిఫ్ట్ ఒకటి వచ్చిందని, కలెక్ట్ చేసుకోవడానికి ఫలానా హోటల్ లేదా క్లబ్‌కు ఫలానా రోజు, ఫలానా టైమ్‌కు రమ్మని చెబుతుంది. జంటగా రావాలని మరీమరీ హెచ్చరిస్తుంది. మైకంలో పడి మీరు వివరాలు అడక్కుండా పెట్టేస్తే పేచీనే లేదు. అలాకాకుండా వివరాలు అడిగితే మాత్రం, ఏదో షాప్‌లో ఫ్రీగిఫ్ట్ కోసం పెట్టిన డబ్బాలోంచి తీసిన లాటరీలో మీ పేరువచ్చిందని చెబుతారు. మరీ అనుమానప్పక్షులైన వారికి పాతిక వేల కూపన్ల నుంచి డ్రా తీసి వంద మందిని ఎంపిక చేశామని వారిలో మీ పేరుందని నచ్చజెప్పుతారు. వాళ్లు చెప్పిన హోటల్, క్లబ్ ప్రముఖమైనవి కావడంతో పిలుపువచ్చిన వారు సహజంగానే ట్రిమ్ముగా తయారై భార్య లేదా భర్తతో సహా వెళ్లిన తర్వాత వుంటుంది అసలు కథ.
నేపథ్యం......
ఈ మధ్య కాలంలో షాపింగ్ ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్స్, లేదా బడా షాప్స్‌లో బిజీ రోజుల్లో ఒక పక్క చిన్న టేబుల్ దానిపై ఒక బాక్స్ పక్కనే కూపన్స్ వున్న పుస్తకాలతో నలుగరయిగురు యువతీ యువకులు కనిపిస్తున్నారు. వారి పక్కనే పెద్ద అక్షరాలతో ఫ్రీ గిఫ్ట్ పొందండి వంటి ఆకర్షణీయమైన ప్రకటన ఒకటి కనిపిస్తుంది. ఫ్రీ అంటే ఆశపడనివారెవ్వరుంటారు? కొంచెం ఆసక్తి చూపి అడిగితే కూపన్‌లో వివరాలు నింపి డబ్బాలో వేస్తే డ్రా తీస్తామని ఫ్రీ గిఫ్ట్ వస్తే ఫోన్‌లో చెప్పుతామని అత్యంత మర్యాదగా అక్కడ వున్న యువతీయువకులు చెబుతారు. వారి మర్యాద, మన్నన చూసి
ముచ్చటేసి సహజంగానే వివరాలు రాసి డబ్బాలో వేస్తారు. ఈ డబ్బాలో వివరాలు రాసి వేసినవారికే పైన చెప్పిన ఫోన్ కాల్స్.
అసలు విషయం...
సరే అదృష్టం తలుపుతట్టి మరీ వస్తే పోకుండా ఎలా వుంటామని వెళ్లిన వారికి అక్కడ ఎదురయ్యే పరిస్థితే అసలు కథ. చక్కగా తయారై వున్న 18-25 ఏళ్ల మధ్య యువతీ యువకులు సదరు హోటల్ లేదా క్లబ్బులో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం వెళ్లిన వారిని రిసీవ్ చేసుకుంటారు. పెద్ద హోల్లోకి తీసకువెళ్లి, కుశల ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తారు. వారి గురించి పరిచయం చేసుకుంటారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్ధులే వుండటం గమనార్హం. వచ్చిన జంటల్లో కొంచెం పెద్ద వయస్సు వున్నవారినయితే అంకుల్, ఆంటీ అనీ చిన్న వయస్సులోని వారయితే బ్రదర్ అని సిస్ అని వరసలు కలిపేసి మరీ ముచ్చట్లు పెడతారు. ముచ్చట్లలో మునిగిన సమయంలోనే పూర్తిగా వ్యక్తగత వ్యవహారాల్లోకి జొరబడి కొత్త ఆశలను చూపిస్తారు. బ్రహ్మాండమైన ప్రపొజల్ వుంది. మెంబర్‌షిప్ తీసుకుంటే ప్రపంచమంతా చూసి రావచ్చని ఊరిస్తారు. ప్రతిదేశంలోనూ మీకంటూ ఒక వసతి వుండటం ఎంత అద్భుతంగా వుంటుందో ఊహించండీ అంటూ అదరగొడతారు. దేశంలోని ప్రధాన టూరిస్టు కేంద్రాల్లో ఏప్పుడూ వెళ్లినా మారాజులాగా రిసీవ్ చేసుకుని ఊరంతా తిప్పే ఏర్పాటు వుంటే ఎలా వుంటుందని ప్రశ్నిస్తారు. ఈ చర్చల మధ్యలోనే కాఫీ లేదా కూల్ డ్రింక్ ఒకటి వస్తుంది. సీనియర్ మానేజర్, టీమ్ లీడర్ అనే ఒ వ్యక్తి మొహం నిండా నవ్వు పులుముకుని వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అతివినయంగా వెనుతిరిగి వెళ్లిపోతాడు. విడియో ప్రజెంటేషన్ పేరుతో, వారి పత్రికలు, హాండ్‌ఔట్స్ చూపిస్తూ కన్వీన్సింగ్ మాట్లాడుతూ కనీసం రెండు గంటల పాటు బుర్రతింటారు. భార్యా భర్తల్లో ఏ ఒక్కరు వీక్ మైండెడ్ అయినా అంతే సంగతులు. ఈ లోపు చుట్టుపక్కల వున్న టేబుల్ దగ్గర నుంచి అటెన్షన్ అంటూ ఒక ప్రకటన వినవస్తుంది. ఫలానా దంపతులు ఈ స్కీమ్‌లో చేరుతున్నారు, వారి గౌరవార్ధం అంటూ చప్పట్ల మోత మోగిస్తారు. జేబులో డబ్బులు లేవంటే ఫర్వలేదు, ముందు సంతకాలు పెట్టండీ అంటారు. డబ్బులకు సంబంధించి సవాలక్ష స్కీమ్‌లు చూపిస్తారు. ఎంతోకొంతకు చెక్కు ఇవ్వండి అంటారు. లేదా జేబులో వున్న మొత్తం ఎంతో ఇవ్వండి అంటారు. మిగిలిన మొత్తం సర్ధుబాటు చేయవచ్చు, తొందరలేదని భరోసా ఇస్తారు.
మెదడు పూర్తిగా వశం తప్పకుండా మొండిగా వుండి వారిచ్చే అమాంబాపతు ఫ్రీ గిఫ్ట్‌తో
బయటపడిన వారు అదృష్టవంతులు. కానీ మధ్య తరగతి మొహమాటాల గురించి విడిగా మాట్లాడుకోవాలా ? మొహమాటంతో ఎంతో కొంత అక్కడ కక్కివచ్చేవారి సంఖ్య ఎంతో కొంత వుంటుంది. ఆ తర్వాత ఫాలోఅప్‌లో గానీ వాస్తవం అర్ధంకాదు. వున్న ఫళంగా లక్షా రెండు లక్షలు సర్ధడం అసాధ్యమన్న విషయం గ్రహించి పోయిన పది, అయిదువేలకు దండం పెట్టుకునే వారే ఎక్కువ.
రిసార్ట్స్, టైమ్ షేరింగ్ ప్రాపర్టీస్ మార్కెటింగ్ వ్యాపారులు అవలంభిస్తున్న ఈ మార్కెట్ వ్యూహం గురించి బయటచెప్పుకుంటే బకరా అని, ఫ్రీగా వస్తే ఫినాయిల్ రకమని బంధుమిత్రులు నవ్వుకుంటారేమోనన్న భయంతో బయటకు చెప్పుకోని వారి సంఖ్య చాలా వుంది. ఈ బలహీనతలనే ఆసరాగా చేసుకుని కొత్త రకం వ్యాపారులు బరితెగిస్తున్నారు.
గత సంచికలో












Click it and Unblock the Notifications