హ్యాపీ న్యూఇయర్
హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో వెలిగిపోతున్న వివియస్ లక్ష్మణ్ పెళ్లి కొడుకు అవుతున్నాడు. లక్ష్మణ్ పెళ్లిపై మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. కథలు కథలుగా పత్రికలు ఆయన పెళ్లి వివరాలపై రాస్తున్నాయి. సస్పెన్స్‌ను కూడా సృష్టిస్తున్నాయి. లక్ష్మణ్ గుంటూరుకు చెందిన ఒక అమ్మాయిన వివాహం చేసుకోబోతున్నాడని మొదట ఆంగ్ల దినపత్రిక బయటపెట్టింది. పెళ్లి కూతురు పేరును గోప్యంగా ఉంచుతున్నారంటూ ఆ పత్రిక రాసింది. అంతే, మీడియా అంతా అటు వైపు దృష్టి సారించింది.
లక్ష్మణ్ వివాహం గుంటూరుకు చెందిన శైలజ అమ్మాయితో నిశ్చయమైపోయిందని ఆ తర్వాత రాశాయి. ఈ పెళ్లి విషయమై లక్ష్మణ్ తల్లితో కూడా మాట్లాడి వివరాలు అందించాయి. మొత్తంగా ఇక్కడ మీడియా దృష్టంతా ఒక్కసారిగా లక్ష్మణ్ పెళ్లి వార్తలపై పడింది. లక్ష్మణ్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో రాణించడమే కాకుండా వన్డేల్లోనూ తన సత్తా చూపిస్తున్నాడు. 27 యేళ్ల లక్ష్మణ్ తల్లిదండ్రులు నిశ్చయించిన అమ్మాయి మెడలోనే బుద్ధిమంతుడిలా తాళి కట్టబోతున్నాడు. ఆయన వివాహం ఫిబ్రవరి 15వ తేదీన జరుగుతోంది. ఫిబ్రవరి 12వ తేదీన ఆయన ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్నాడు.
టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు లక్ష్మణ్ తలిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లారు. భారత క్రికెట్ జట్టు సభ్యులను వివాహానికి ఆహ్వానించడానికి వారు ఆస్ట్రేలియా వెళ్లారని సమాచారం. ఈ వివాహానికి హాజరయ్యేందుకు భారత క్రికెట్ జట్టు సభ్యులు అప్పుడే ఏర్పాట్లు చేసుకున్నారట. సచిన్ దంపతులు ఇక్కడి ఒక స్టార్ హోటల్‌లో బసకు ఏర్పాటు కూడా చేసుకున్నారని చెబుతున్నారు.
లక్ష్మణ్ తలిదండ్రులు నిశ్చయించిన వివాహానికి తల ఊపడంతో ఆరేంజ్డ్ మ్యారేజీ ఫ్యాషన్ అయిందని కూడా పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాహుల్ ద్రావిడ్ అదే విధంగా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన మురళీ కార్తిక్ వివాహం కూడా అదే విధంగా జరిగింది. ఇక వివాహం కాకుండా భారత జట్టులో మిగిలేది ఒకరిద్దరే.
క్లీన్ ఇమేజ్ ఇప్పుడు భారత ఆటగాళ్లకు ముఖ్యమైందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ స్థితిలోనే పెద్దలు నిశ్చయించిన పెళ్లిళ్లకు తలలూపుతున్నారని అంటున్నారు. భారత జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఒక నటి ప్రేమాయణంలో పడినట్లు
వచ్చిన వార్తలు పెద్ద దుమారం రేపాయి. అందువల్ల క్లీన్ ఇమేజ్ కోసం క్రికెటర్లు తపిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications
