• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిన్న అజర్ తనయడు, నేడు కోమటిరెడ్డి కొడుకు, రేపు..

By Pratap
|

Outer Ring Road Accidents
నిన్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ అజరుద్దీన్ తనయుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు బలయ్యాడు. నేడు రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు తనువులర్పించాడు. అంతకు ముందు ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కుమారుడు ప్రసాద్, ఇంకా బాబూ మోహన్ తనయుడు పవన్, ఇలా... చెప్పుకుంటూ పోతే చాలా... దాదాపు వందకు పైగా అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించి ఉంటాయని ఓ అంచనా. ఇటీవలే ఇద్దరు మంత్రుల కుమారులు కూడా ప్రమాదానికి గురైతే, గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రిలో చికిత్స చేయించి పంపించేశారట. రేపు ఎవరనేది ప్రశ్నార్థకం...

అతి వేగమే ప్రమాదాలకు కారణమని భావిస్తున్నారు. ఈ రోడ్డుపై వాహనాల వేగం కనిష్టంగా అరవై, గరిష్టంగా 140 వరకు ఉంటుంది. త్వరలో ఇక్కడ టోల్‌గేటు కూడా పెట్టబోతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ జరిగే ప్రాణ నష్టాలను చూస్తే మాత్రం భయమేస్తుంది. రింగురోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత నగరంలో స్పోర్ట్స్ బైక్‌లు, కాస్ట్‌లీ బైక్‌ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. రెండు నుంచి 20 లక్షల వరకు ధర పలికే బైక్‌లను కొనుగోలు చేస్తున్న యువత ఔటర్‌పై వేగంగా వెళుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ప్రస్తుతం అవుటర్ రింగ్‌రోడ్డు రెండో దశ నార్సింగ్ నుంచి పఠాన్‌చెరువు వరకు ప్రారంభంకావడంతో బైక్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. నార్సింగ్ నుంచి కొల్లూరు మీదుగా పటాన్‌చెరువు వరకు ఉన్న ఔటర్ రెండో దశ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డులో పది కిలోమీటర్ల వరకు ఎలాంటి టర్నింగ్‌లు లేవు. ఇక్కడ 120 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో కార్లు ప్రయాణిస్తుంటాయి. ఎలాంటి అడ్డంకులు లేకుండా పది కిలోమీటర్లు రోడ్డు నేరుగా ఉండడంతో చాలామంది ఇక్కడ రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. రేసింగులు నడుపుతూ బెట్టింగులు కట్టే ముఠాలు కూడా ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడి కారు ప్రమాదానికి గురైంది కూడా ఇక్కడే. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో ఇక్కడ కార్ల రేసింగ్‌లు జరుగుతున్నాయి.

అవుటర్ రింగురోడ్డులో ద్విచక్ర వాహనాలు తిరగడం నిషేధం. అయినా ప్రతి రోజు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సినీ నటుడు కోట శ్రీనివాసరావు కొడుకు ప్రసాద్ దుర్మరణం చెందిన తరువాత కొద్దికాలం కఠినంగా వ్యవహరించిన పోలీసులు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. మూడు నెలల క్రితం బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ కమిషనర్, రాజేంద్రనగర్ ఏసీపీ పట్టుకున్నారు. ద్విచక్ర వాహనాల రాకపోకలపై పోలీసులు ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అవుటర్ రింగురోడ్డులో రాత్రి వేళ ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. ఓవర్ స్పీడుతో పాటు రాంగ్‌రూటులో రావడం, వాహనాలు చీకట్లో ఎక్కడ పడితే అక్కడ నిలిపి వేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రత కారణంగా రాత్రి సమయాల్లో ఈ రోడ్డుగుండా రాకపోకలు సాగించేందుకు అనేకమంది భయపడుతున్నారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఒక చౌరస్తా నుంచి మరో చౌరస్తాకు దాదాపు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో జన సంచారం ఉండదు. ఇక్కడ ఏమైనా జరిగితే చీమ కూడా చిటుక్కుమనదు. ఆదుకునేవారు ఉండరు. ఏమైనా, హైదరాబాదు రద్దీని తగ్గించి, ప్రయాణాలకు ఆటంకం కలగకూడదని తలపెట్టిన అవుటర్ రింగ్ రోడ్డు మృత్యురహదారిగా మారింది.

English summary
Hyderabad outer ring road became well known for accidents and deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X