వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ: తెలంగాణ వర్సెస్ సమైక్యాంధ్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. కమిటీ ఏర్పాటుకు ముందు తెలంగాణ వర్సెస్ సమైక్యాంధ్ర ఉన్నట్లుగానే కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అలాగే మిగిలింది. శ్రీకృష్ణ కమిటీ ఆరు ప్రత్యామ్నాయాలు చూపినప్పటికీ మూడింటినే తానే కొట్టేసింది. మిగిలినవి మూడు ప్రత్యామ్నాయాలు. ఈ మూడు ప్రత్యామ్నాయాల్లోనూ నాలుగో ప్రత్యామ్నాయాన్ని కూడా కొట్టేయవచ్చు. కమిటీ అభిప్రాయం ప్రకారమే దాన్ని కొట్టేయడానికి వీలవుతోంది. ఇక పరిస్థితి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, సమైక్యాంధ్ర కొనసాగింపు. సమైక్యాంధ్ర కొనసాగింపునకు కమిటీ తొలి ఓటు వేసింది. అయితే, తెలంగాణకు రాజ్యాంగబద్ధమైన పరిరక్షణలు కల్పించాలని సిఫార్సు చేసింది. ఇందులో కూడా మెలిక ఉంది.

యథాతథ స్థితి కొనసాగింపు కమిటీ తొలి ప్రతిపాదన. ఎప్పటిలా దీన్ని రాజకీయ/శాంతిభద్రతల సమస్యగానే పరిగణిస్తూ రాష్ట్రానికే వదిలెయ్యటం వల్ల ప్రయోజనం ఉండదని, తక్షణం కచ్చితమైనచర్యలేవీ లేకపోతే తెలంగాణ ప్రజలు మానసికంగా సంతృప్తి చెందే అవకాశమే లేదని కమిటీ అభిప్రాయపడింది. అందుకే దీనికి ఆఖరి ప్రాధాన్యం ఇచ్చింది.

రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విడగొట్టి, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం. రెండు రాష్ట్రాలూ వేర్వేరు రాజధానులను అభివృద్ధి చేసుకోవడం. తమ ఆర్థిక ప్రయోజనాలకు నష్టముండదు కాబట్టి ఇది సీమాంధ్ర ప్రజలకు కొంత ఆమోదయోగ్యం కావచ్చు గానీ తెలంగాణలో తీవ్ర నిరసనలు రేగుతాయి. వారికి తెలంగాణ ఇచ్చిన తృప్తే ఉండదు. కాబట్టి ఆచరణలో ఇది అసాధ్యం. ఇదీ కమిటీ రెండో ప్రత్యామ్నాయంపై కమిటీ వివరణ.

రాష్ట్రాన్ని రాయల-తెలంగాణ, కోస్తాంధ్రలుగా విభజించటం, హైదరాబాద్‌ను రాయల-తెలంగాణలో అంతర్భాగంగా ఉంచటం. కొన్ని రాయలసీమ వర్గాలు, ముస్లిం జనాభా ప్రాబల్య దృష్టితో ఎంఐఎం ఈ ప్రతిపాదన తెచ్చాయి. దీన్ని తెలంగాణ వాదులు ఒప్పుకోరు, పైగా ఇది మతఛాందస శక్తులకూ వూతమివ్వచ్చు. అంతిమంగా ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. అందువల్ల ఈ మూడో ప్రత్యామ్నాయాన్ని కమిటీ కొట్టేసింది.

సీమాంధ్ర, తెలంగాణలను వేరుచేయటం. హైదరాబాద్‌ ను (నల్గొండ జిల్లా మీదుగా గుంటూరు, మహబూబ్‌నగర్‌ జిల్లా మీదుగా కర్నూలు జిల్లా హద్దులకు విస్తరించేలా) కేంద్ర పాలిత ప్రాంతంగా, ఉమ్మడి రాజధానిగా చేయటం.హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అంటే తెలంగాణ వాదులు ససేమిరా ఒప్పుకోరు. రాష్ట్రంలో కొంతభాగాన్ని కేంద్ర పాలన కిందకు తేవడంపై మూడు ప్రాంతాల నుంచీ వ్యతిరేకత రావచ్చు. ఈ నాలుగో ప్రత్యామ్నాయానికి కమిటీ మూడో ప్రాధాన్యం ఇచ్చింది. అయితే, ఇది ఆచరణ సాధ్యం కాదని కమిటీ వివరణలోనే ఉంది.

సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం. తెలంగాణకు హైదరాబాద్‌ను, సీమాంధ్రకు మరో కొత్త రాజధాని ఏర్పాటు చెయ్యటం. దీంతో తెలంగాణ ప్రజల పూర్తి ఆకాంక్ష నెరవేరుతుందిగానీ-హైదరాబాద్‌, జలవనరుల విషయమై సీమాంధ్రలో అల్లర్లు చెలరేగవచ్చు. రాయలసీమలోనూ, దేశమంతా కూడా వేర్పాటు డిమాండ్లు రావొచ్చు. అయితే ప్రత్యేక తెలంగాణ డిమాండులో కొంత న్యాయం లేకపోలేదు. విభజిస్తే సీమాంధ్ర ప్రజల అవసరాలనూ పట్టించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ద్వితీయ ప్రాధాన్యం. అనివార్యమైతేనే, అందరికీ ఆమోదయోగ్యమైతేనే విభజించాలని సిఫార్సు చేస్తున్నాం. ఇది తెలంగాణవాదులు కోరుతున్నది. దీనికి కమిటీ రెండో ప్రాధాన్యం ఇచ్చింది. సమస్యనే ఈ డిమాండ్ నుంచి ప్రారంభమైంది. కాబట్టి రెండో ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణవాదులు శాంతించే పరిస్థితి లేదు.

తెలంగాణ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికీ, రాజకీయ సాధికారతకూ నిర్దుష్టమైన రాజ్యాంగ బద్ధ చర్యలు తీసుకుంటూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం. రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యటం వల్ల ప్రస్తుత సమస్యలకు సుస్థిర పరిష్కారాలు రావు. సమైక్యంగా ఉండటం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కీలకం. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రాజ్యాంగ బద్ధమైన 'ప్రాంతీయ మండలి' ఏర్పాటును సిఫార్సు చేస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కొల్పేలా ఉండాలి. జాతీయ దృక్పథంతో చూసినా ఇదే మేలు. అందుకే దీనికే మా తొలి ఓటు. ఇది కమిటీకి ప్రధానమైంది. గతంలో ఇచ్చిన రాజ్యాంగ రక్షణలేవీ అమలు కాలేదని, అందువల్లనే పరిస్థితి ఇంత దాకా వచ్చిందని తెలంగాణవాదులు అంటున్నారు. పైగా, తెలంగాణకు రాజ్యాంగ రక్షణలు కల్పించడానికి సీమాంధ్ర రాజకీయ నాయకులు అంగీకరించకపోవచ్చు కూడా.

ఈ రకంగా చూస్తే, శ్రీకృష్ణ కమిటీ నివేదిక మళ్లీ తెలంగాణ, సీమాంధ్రల మధ్య చిచ్చు అలాగే కొనసాగడానికి మార్గం వేసిందే తప్ప సమస్య పరిష్కారానికి పనికి వచ్చే విధంగా లేదు. సమైక్యాంధ్ర, తెలంగాణల కోసం ఇరు ప్రాంతాలు గతంలో మాదిరిగా ఉద్యమ స్థావరాలుగా మారుతాయనడంలో సందేహం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X