• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యాదిరెడ్డి ఆత్మహత్య: కొండా వెంకట రంగారెడ్డి ఊరు

By Pratap
|

Yadi Reddy
ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో గర్జించిన కొండా వెంకటరంగారెడ్డి స్వగ్రామం. గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చీ హై (బానిస బతుకు కన్నా మరణం మేలు) అని ప్రకటించిన నాయకుడతను. ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి, కాంగ్రెసు ఢిల్లీ పెద్దల ఒత్తిడికి, స్థానిక రాజకీయాల లాబీకి తలొగ్గి పెద్ద మనుషుల ఒప్పందంపై సగం మనసుతో సంతకం చేసి విలీనానికి అంగీకరించిన నాయకుడు. ఆ గ్రామం ఇప్పుడు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి లోకసభ నియోజకవర్గంలో ఉంది.

ప్రముఖ దర్శకుడు బి. నర్సింగరావు, సీనియర్ జర్నలిస్టు చెన్నమనేని రాజేశ్వర రావు, ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి ఆ ఊరికి బయలుదేరాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించాలనేది మా ఉద్దేశం. హైదరాబాదుకు దగ్గరలోనే ఉంటుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఉంది. అసలు రంగారెడ్డి జిల్లా పేరే కొండా వెంకటరంగారెడ్డి పేరు మీద వచ్చింది. ఆయన అల్లుడు, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ రాజకీయ నాయకుడు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలతో ఓ జిల్లాను ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లాగా నామకరణం చేశారు.

మేం పెద మంగళారం వెళ్లే సరికి, యాదిరెడ్డి కుటుంబ సభ్యులంతా ఐదో రోజు పెద్ద కర్మ ముగించారు. మేం వెళ్లగానే యాదిరెడ్డి కుటుంబ సభ్యులంతా మా చుట్టూ చేరారు. వారి ముఖాల్లో విషాదం కొట్టొచ్చినట్లు కనిపించింది. తమ్ముడు ఓం రెడ్డి మా పక్కన కూర్చుని - యాదిరెడ్డి గురించి యాది చేసుకున్నాడు. యాదిరెడ్డి హైదరాబాదులోని లంగర్‌హౌస్‌లో ఓ గది అద్దెకు తీసుకుని డ్రైవర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. ఓం రెడ్డి తమకున్న అర ఎకరంతో మరికొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటాడు. తెలంగాణలో వ్యవసాయమంటే అందరికీ తెలిసిందే. శరీర కష్టం తప్ప ఏమీ మిగలదు. యాదిరెడ్డి తల్లి చంద్రకళ బక్కపలచగా, జీవిత భారాన్ని బలవంతంగా మోస్తున్నట్లు కనిపించింది. యాదిరెడ్డి రోజూ ఫోన్ చేసి, తిన్నావా, లేదా అని తప్పకుండా అడిగేవాడట.

ఢిల్లీకి వెళ్లేటప్పుడు కూడా చెప్పాడట. తాను ఆందోళన వ్యక్తం చేస్తే, ఏమీ కాదు, వెంటనే వచ్చేస్తా కదా అని చెప్పాడట. కానీ, యాదిరెడ్డి సూసైడ్ నోట్ వేరే ఉంది. తల్లిని చూడాలనిపించిందని, అలా వెళ్తే తన నిర్ణయం మారిపోతుందనేమోనని భయపడ్డానని రాశాడు. అంటే, కచ్చితంగా ఆత్మహత్య చేసుకోవడానికే యాదిరెడ్డి ఢిల్లీ వెళ్లాడనేది అర్థమవుతోంది. యాదిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. యాదిరెడ్డి తల్లిది మరో విషాద గాధ- భర్త నర్సింహా రెడ్డి 20 ఏళ్ల క్రితం పురుగుల మందు తాగి, ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడట. కారణం చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. ముగ్గురు చిన్న పిల్లలను సాకి, పెద్ద చేసింది. చేతికి అంది వచ్చిన పెద్ద కొడుకు యాదిరెడ్డి మరణం ఎంతగా కుంగదీసిందో ఆమె ముఖం చూస్తే తెలిసిపోయింది. నర్సింగరావు ఏదో కొంత మొత్తం ప్యాక్ చేసి ఇచ్చిన సొమ్మును నేను యాదిరెడ్డి తల్లి చంద్రకళ చేతిలో పెట్టి అందరం వెనుదిరిగాం.

తెలంగాణ విద్యార్థులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే విషయంపై కారణాలు వెతకడంపై కన్నా వారి ఆత్మహత్య పరంపర మదిని తొలచడం ప్రారంభించింది. యాదిరెడ్డి మరణం తర్వాత కూడా తెలంగాణలో రోజుకు ఒకటో, రెండో యువకుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రాజకీయ నేతల మోసానికి విఫలమైన తర్వాత ఓ తరం తెలంగాణ యువత మొత్తం నక్సలైట్ ఉద్యమంలోకి నడిచింది. ఇంజనీరింగ్, వైద్యం వంటి ఉన్నత చదువులను ముగించో, మధ్యలో వదిలేసో నక్సలైట్ ఉద్యమాన్ని వారు కౌగలించుకున్నారు. సమాజానికి మేలు చేయాలనే లక్ష్యం వారిని అటు నడిపించింది. దానివల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా అనే విషయాన్ని పక్కన పెడితే, సీమాంధ్ర రాజకీయ ప్రయోజనాలు మాత్రం నెరవేరాయని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.

ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం వామపక్ష ఉద్యమాలతో హోరెత్తింది. 1980 దశకం మధ్యలోకి వచ్చేసరికి చల్లారింది. విశ్వవిద్యాలయం పూర్తి స్తబ్దుగా మారిపోయింది. మళ్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదంతో దద్ధరిల్లుతోంది. అయితే, అయినా ఆత్మహత్యలు ఆగడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమ పరిమితులు, నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లలేని స్థితి వారిని ఆత్మహత్యలకు పురికొల్పోతున్నదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పాలకవర్గాల విముఖత పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసే అతి పెద్ద పోరాట రూపంగా ఆత్మహత్యలను వారు భావించి అందుకు సిద్ధపడ్డారా? ఏమైనా, తెలంగాణ తల్లి శోకం ఆగేదిగా కనిపించడం లేదు. గుక్క పట్టి ఏడుస్తున్న తెలంగాణ తల్లికి నిష్కృతి ఏది, పిల్లలకు దిక్కేది?

దీనికంతటికీ రాజకీయ వ్యవస్థ కారణం కాదా, సమస్యను తేల్చకుండా పార్టీల ప్రయోజనాలే ముఖ్యమని ఆలోచిస్తున్న ఢిల్లీ పెద్దల పాపం కాదా?

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
I visited peda Mangalaram village in Rangareddy district, which belongs to Yadi Reddy, who committed suicide in Delhi for Telangana, along with cine director B Narsingh Rao, senior journalist Ch Rajeshwar Rao and prominent poet Sunkireddy Narayana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X