సాహస యాత్రికులు: 63లో బాబు, 35లో షర్మిల

బాబు 2,300 కిలోమీటర్ల యాత్ర చేస్తుండగా, షర్మిల 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ఇంత పెద్ద యాత్ర చేపడుతున్న వారు ప్రత్యేక ఫుడ్ తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రోజు నడుస్తున్న సమయంలో ప్రతి అరగంటకో గంటకో ఓసారి కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ఇలాంటి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే పాదయాత్ర కోసం ప్రత్యేక షూ వాడుతున్నారు.
నూనె వస్తువులు తీసుకోవడం లేదు. శక్తినిచ్చే ఆహారపదార్థాలు తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు విశ్రాంతిని కూడా తీసుకుంటున్నారు. షర్మిల కూడా తన పాదయాత్రలో ఇలాగే పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బాబు ఆరోగ్యాన్ని చూసుకునేందుకు వైద్యులు కూడా ఆయన వెంట ఉన్నారు. షర్మిల వెంట కూడా వైద్యులు ఉంటారు. బాబు 63 ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తగా, మూడు పదుల వయస్సులో ఉన్నప్పటికీ షర్మిల బాబుకు ధీటుగా పాదయాత్రకు సిద్ధమై మరింత ఆసక్తిని రేకెత్తించింది.
దీంతో ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు, షర్మిల పాదయాత్రల పైనే ఉంది. దాదాపు ఐదారు నెలల పాటు బాబు, షర్మిల పాదయాత్ర చర్చనే ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాదయాత్ర ఇప్పటికే ప్రారంభించిన బాబు కాళ్లు ఇప్పటికె బొబ్బలెక్కాయి. ముఖంలో నీరసం కనిపిస్తోంది. పాదయాత్ర ప్రారంభించిన రోజుకు ఈ రోజుకు బాబు మొహంలో చాలా తేడా వచ్చింది. అంతా పీక్కు పోయినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.
చంద్రబాబు 63 ఏళ్ల వయస్సులో ఈ సాహసానికి పూనుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే టిడిపిని మరోసారి గట్టెక్కించాలంటే ఆయనకు ఇంతకంటే మరో మార్గం దొరికినట్లుగా కనిపించలేదనే చెప్పవచ్చు. బాబు వయస్సు ఎక్కువగా ఉండటమే కాకుండా డయాబెటిస్ కూడా ఉంది. అయితే ఇతను బలవర్ధక పదార్థాలు తీసుకుంటున్నారు. ఫిజిక్ కూడా ఫిట్‌గా ఉంటుంది. రోజు యోగా చేస్తారు. ఇతను గతంలో పలు పాదయాత్రలు చేశారు. కానీ ఇంత పెద్ద పాదయాత్ర మాత్రం ఇదే తొలిసారి.
షర్మిల వయస్సు 35. ఆమె తన సోదరుడు జగన్ కోసం ఈ పాదయాత్ర తలపెట్టారు. షర్మిల మూడు పదుల వయస్సులో ఉండటమే కాకుండా ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. యుక్తవయస్సులో ఉండటం, రోజూ ఎక్సర్‌సైజులు చేయడం, ఆరోగ్యదాయక డైట్ తీసుకోవడం తదితరాలు ఆమె చేస్తుంటారు. అయితే ఓ మహిళ అయి ఉండి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధపడటం మాత్రం సామాన్యమైన విషయమేం కాదు. వీరిద్దరూ అమర్నాథ్, హజ్ యాత్రకు వెళ్లే భక్తుల లాగా ఆరోగ్య సూత్రాలు పాటించాలని, ప్రతిరోజు హెల్త్ చెకప్ చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications