ఏ క్షణంలోనైనా మంత్రి మోపిదేవి అరెస్టు?

మోపిదేవి వెంకట రమణ సోమవారం సిబిఐ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ వ్యవహారంలోనే ఆయన గతంలో ఓసారి సిబిఐ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనను సిబిఐ విచారణకు పిలువడం ఇది రెండోసారి. నిమ్మగడ్డ ప్రసాద్, అధికారి బ్రహ్మానంద రెడ్డిని అరెస్టు చేసి విచారించిన నేపథ్యంలో మోపిదేవిని సిబిఐ విచారణకు పిలువడం ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అంటున్నారు.
ఆధారాలు దొరికితే ఎంతటివారినైనా అరెస్టు చేయాలని ఢిల్లీ నుంచి సిబిఐ ఉన్నత స్థాయి వర్గాలు ఇక్కడి విచారణాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో మోపిదేవిని సోమవారం గానీ ఆ తర్వాత గానీ ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చుననే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాన్‌పిక్‌కు ఇష్టారాజ్యంగా ప్రయోజనాలు చేకూరుస్తూ రూపొందించిన అవగాహనా పత్రం (ఎంఓయు) మోపిదేవి ఆమోదంతోనే మంత్రివర్గం ముందుకు వెళ్లిన విషయం సిబిఐ గుర్తించినట్లు చెబుతున్నారు.
ఆర్థిక, న్యాయశాఖల సూచనలను వ్యతిరేకిస్తూ వాన్‌పిక్ ఎంఓయును రూపొందించినట్లు సిబిఐ దృష్టికి వచ్చిందని అంటున్నారు. వాన్‌పిక్ ప్రాజెక్టులో భాగంగా నిజాంపట్నం, వాడరేవు అనే రెండు ఓడరేవులను నిర్మించాలి. నిజాంపట్నానికి ఉత్తరాన 30 కిలోమీటర్లు, వాడరేవుకు దక్షిణాన 30 కిలోమీటర్లు ఇవ్వాలని మొదట నిర్ణయించారు. రెండు రేవులకు ఇరువైపులా కాకుండా వాటి మధ్య స్థలంపై హక్కు కల్పిస్తే సరిపోతుందని ఆర్థిక, న్యాయశాఖలు ప్రతిపాదించాయి. అయితే, దానికి మోపిదేవి అంగీకరించలేదని అంటున్నారు. దీంతో అదనంగా వాన్‌పిక్‌కు 30 ఎకరాలు కేటాయించాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి సమక్షంలో మోపిదేవిని సిబిఐ అధికారులు విచారిస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications