రఘు: చరిత్రను చిగురించే చూపు!(పొటోలు)
‘కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు' అన్నట్లుగా కాపు వెంకట రఘు తెలంగాణలోని సిద్దిపేట నుంచి అనురాధతో 1986 ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం, బళ్లారి జిల్లాలోని హంపి వెళ్లారు. అందరు కొత్త దంపతుల్లా మొక్కులు మొక్కు కోవడానికి కాదు. మానవాళి వారసత్వాన్ని దర్శించాలని ఒక చిత్రకారుడిగా, ఆర్కిటెక్ట్‌గా, ఫొటో గ్రాఫర్‌గా రఘు ఇల్లాలితో వెళ్లాడు. ఆ సందర్భం అనురాధకు సతతహరితమే.
‘అక్కడ అద్భుతంగా కనిపించే నిర్మాణాలే కాదు, సాదాసీదా రాళ్లు, రప్పలు అనుకున్నవీ రఘుకి ఆసక్తిని కలిగించేవి. వాటిలో ఏదో చూసేవాడు. డ్రాయింగ్ షీట్ తీసుకుని స్కెచ్ వేసేవాడు. స్కెచ్ చూస్తే నాకూ ఆశ్చర్యం కలిగేది. ఇంత అందం ఉన్నది కదా వీటిలో, అన్పించేది!' అని గుర్తు చేసుకున్నారు.

గుర్బార్గాలో ఆర్ట్ టీచర్‌గా పిల్లలను బడి నుంచి ప్రకృతి ఒడిలోకి తీసుకువెళ్లి ఆయా ప్రాంతాల చారిత్రక నిర్మాణాలను చూపేవాడని, ‘వస్తువు'ను ఎట్ల చూడాలో, ఎట్ల చూపాలో చెప్పేవాడని రఘు సహచరి గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ తదితర ప్రాంతాలను రఘు చూసిన తీరు, చూపిన తీరు ఫైనార్ట్స్ విద్యార్థులకు ఉత్తేజాన్నిస్తుంది. క్రీ.పూ. శాతవాహన చక్రవర్తి హాలుడు సంకలన పరచిన గాథాసప్తశతిలో ఒక గాథ రఘు-అనురాధల దాంపత్యానికి వర్తిస్తది.

‘భార్యాభర్తలో చనిపోయిన వ్యక్తి బతికినట్లు బతికిన వ్యక్తి చనిపోయినట్లు'
అనురాధ ఇప్పుడు తనను మరచిపోయింది. రఘును జీవింపజేసుకుంది. రఘు చిత్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సంకల్పించడం, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం నిర్వాహకుడు మామిడి హరికృష్ణ చొరవ చూపడంతో రఘు వర్తమానంలోకి మనముందుకు వచ్చిండు. తన వర్క్ ద్వారా. రఘు హంపి ఫొటోలు ప్రపంచ ఫొటోగ్రఫీ చరిత్రను, తెలుగువారి చరిత్రనూ గుర్తు చేస్తున్నవి.

హంపి రాజధానిగా ఏర్పడిన విజయనగరం క్రీ.శ. 1565లో రాక్షసతంగడి యుద్ధంలో ఓడిపోయింది. రాజధాని శిథిలమైంది. చెట్టూ, చేమా అడవులు పెరిగినవి. శతాబ్దాలు గడిచినవి. మన వాండ్లకు చారిత్రక అపస్మారక స్థితి సంభవించింది. అసువంటి స్థితిలో ఈస్టిండియా కంపెనీ సర్వేయర్ కల్నల్ మెకంజీ క్రీ.శ. 1800 సంవత్సరంలో హంపి శిథిలాల కీకారణ్యంలోకి ప్రవేశించాడు. డ్రాఫ్ట్‌మెన్‌లతో డ్రాయింగులు వేయించాడు. ఇంగ్లండ్ పంపాడు. ప్రపంచ చారిత్రక చిత్రపటంలో తొలిసారిగా హంపి నమోదైంది. ఆ తర్వాత 39 సంవత్సరాలకు ఆగస్టు 19న ఫ్రెంచ్ ఆర్టిస్ట్ రూపొందించిన డాగురె కెమెరా ఆవిష్కృతమైంది.
1950ల్లో కెమెరా కన్ను స్పష్టతను సంతరించుకుంది. ఫొటోగ్రఫీ తప్పటడుగులు వేస్తోన్న ఆ తొలి రోజుల్లో, ప్రథమ భారత సంగ్రామానికి ఏడాది ముందు అలెగ్జాండర్ గ్రీన్-లా అనే బ్రిటిష్ ఫొటో గ్రాఫర్ హంపి విచ్చేశాడు. అద్భుతమైన ప్రొఫెషనల్ సామర్థ్యంతో అతడు తీసిన చిత్రాలు ఆర్కిటెక్చరల్ ఫొటోగ్రఫీకి బైబిల్ వంటివి.

130 సంవత్సరాల తర్వాత 1983లో జాన్‌కొలిన్స్ అనే ఫొటో గ్రాఫర్ గ్రీన్-లా తీసిన వాస్తు నిర్మాణాలను అవే ఏంగిల్స్‌లో ఫొటోలు తీశాడు. ఇరువురి ఫొటోలను హంపి క్షేత్రంలో అంతర్భాగమైన కమలాపూర్ మ్యూజియంలో చూసే వీలుంది. రఘు ఈ ఇరువురి ఫొటోలను చూశాడని ఆయన ఫొటోలు తెలియజేస్తున్నవి. ఆ ఇరువురూ చూడనివి కూడా చూశాడని, చూపాడని తెలియజేస్తున్నవి. ఏకశిల రథం చుట్టూ, విఠల మందిరంలోపల ఎగుడుదిగుడుల బండలు, కుంగిపోతున్న శిల్పభరితమైన వసారాలను చూపిస్తున్నవి.

కొత్త చూపు రఘు వారసత్వం
‘సంప్రదాయానికి అతుక్కోని ఆధునికత, ఆధునికతకు వెంపర్లాడని సంప్రదాయం' చిత్రకారుడు కాపు రాజయ్య ప్రత్యేకత. చిన్న కిరాణా అంగడి ఆసరాగా బతుకుబండిని లాగిన తండ్రి రాజయ్య చిన్నతనంలోనే చనిపోయాడు. మర్క చంద్రయ్యగౌడ్ అనే పెద్ద మనసు రాజయ్యకు ఆసరా అయ్యింది. గ్రామాలలో సహజమైన సంస్కృతి అంతరించి గ్లోబల్ గ్రామం రూపొందుతున్న వర్తమానంలో తన చిత్రాల ద్వారా అంతరించిపోతోన్న గ్రామాన్ని జవజీవాలతో శాశ్వాతం చేశాడు. రేపు గ్రామానికి కొత్త కళ ఇచ్చేందుకు రాజయ్య చిత్రాలు ‘కాపు' కాస్తాయి.

‘ఎదిగిన కొడుకు వీరుని చేతిలో ఆయుధం' అని నానుడి. వీరుని వృద్ధాప్యంలో ఒంటరిని చేసి ‘ఆయుధం' అదృశ్యమైంది. బహుశ: ఆ వ్యధతోనే రాజయ్య కొడుకును చేరాడు. జాతీయస్థాయి చిత్రకారుడైన కాపు రాజయ్య కుమారుడు అనే ట్యాగ్‌లైన్‌ను రఘు ఎప్పుడూ ధరించలేదు. రఘు ప్రమాదవశాత్తూ మరణించేవరకూ ఆ సంగతి అందరికీ తెలియదు.
తండ్రి గ్రామాన్ని తన చిత్రకళతో పరిరక్షిస్తే కుమారుడు ఆ వారసత్వాన్ని అందుకుని చరిత్రలోని ఆర్కిటెక్చర్‌ను వర్తమాన ప్రయోజనాలకు ఉపకరించేలా కృషి చేశాడు. లారీ బెకర్ ఏకలవ్య శిక్ష్యుడైన రఘు కేరళ వెళ్లి బెకర్ ఆశీస్సులు పొంది పేద ప్రజలకు సనూతన డిజైన్స్‌తో ఇండ్లు కట్టవచ్చని ప్రతిపాదించాడు. ఆర్కిటెక్చర్‌లో తన ప్రవేశం, చిత్రకళ, ఫొటోగ్రఫీని చారిత్రకంగా అనుసంధానించాడు. రఘుని హంపి ఆకర్షించిన కారణాలు ఏమై ఉంటవి!

వింధ్య పర్వతాల వరుస దక్కన్ పీఠభూమికి ఉత్తరం వైపు ఉంటే హంపి దక్షిణాన ఉంటుంది. దక్కన్ పీఠభూమికి ప్రత్యేకమైన శిలలు హైద్రాబాద్ పరిసరాలకు సహజాభరణాలు. ఇవి హంపీలోనూ విస్తారంగా ఉన్నవి. ఆదిమ మానవుడు ఆకృతి పొందడానికి ఎంతో పూర్వమే ప్రకృతి వేదికపై ఈ శిలలు అలంకృతమై ఉన్నవి. హంపి శిలల సహజ ఆకృతులను రఘు త్రీడీ ఎఫెక్ట్ వెలుగునీడలతో చూపాడు. భౌగోళికంగానే కాదు, హంపి సాంస్కృతికంగా కూడా తెలుగువారి కొనసాగింపు.

కాకతీయ సామ్రాజ్యం అనే కుదురు నుంచి నాటుకున్న కొమ్మ కాబట్టి. క్రీ.శ. 1323లో తుగ్లక్ చేతిలో కాకతీయ సామ్రాజ్యం పరాజితమైంది. ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కొలువులోని హరిహరరాయలు-బుక్కరాయలు కాలానుగుణంగా మతం మార్చుకుని ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీ విశ్వాసపాత్రులుగా దక్షిణాదికి వచ్చి 1336లో హంపీలో స్వతంత్ర సామ్రాజ్యం స్థాపించారు. ఇరువురి సోదరులు విత్తిన వృక్షం సమస్త దక్షిణాపధానికి రెండు శతాబ్దాలకు పైగా శాంతి భద్రతలను ఇచ్చింది. చిత్రమేమిటంటే ప్రస్తుతం అక్కడి హరిహర బుక్కరాయల శిల్పంలో ఒకరు అదృశ్యమయ్యారు!
విరూపాక్ష మందిరం ప్రాకారంలో తుంగభద్రా నదివైపున ఉండే అవిభాజ్యుల్లో ఒకరి శిల్పం ఇటీవలి కాలంలో శిథిలమైంది. హరిహర బుక్కరాయలు తెలుగువారు కాదని ఒక భాషావాదులు, తెలుగువారు అయినా మన వారు కాదని మరొక ప్రాంతీయులు శిథిల శిల్పం గురించి మౌనంగా ఉన్నారు. ఆ శిల్పానికి పునరాకృతినివ్వాల్సిన ఆవశ్యకతను కేంద్ర పురావస్తు శాఖ, హంపి డెవలపింగ్ ఆథారిటీ గుర్తించేలా చేయడం రఘుకి గొప్ప నివాళి కాగలదు!
కాగా, హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతి ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో రఘు చిత్రాలతో బుధవారం(నవంబర్ 18న) ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 22 వరకు కొనసాగుతుంది. ప్రతీ రోజూ ఉదయం 11గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుంది.
- పున్నా కృష్ణమూర్తి, ఇండింపెండెంట్ జర్నలిస్ట్













Click it and Unblock the Notifications