రోజుకు 92 రేప్‌లు: ఆత్మహత్యల్లో టాప్
న్యూఢిల్లీ/ జెనీవా: దేశంలో మహిళలపై దాష్టీకాలకు అంతు లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా సగటున రోజుకు 92 మందిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఢిల్లీ పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. దేశరాజధానిలో రోజుకు నలుగురి అత్యాచారాలకు గురై, ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించిన ఈ గణాంకాలను వెల్లడించారు. దేశంలో అత్యాచారాలు 2012లో 24 వేల 923 నమోదు కాగా, ఏడాదిలో ఈ సంఖ్య 33,707కి పెరిగింది. 2013లో నమోదైన 15,556 అత్యాచార కేసుల్లో బాధితుల వయసు 18-30 సంవత్సరాల లోపే.
నిరుడు ఢిల్లీలో నమోదైన కేసుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అయిందని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. 2013లో మొత్తం 1636 అత్యాచారాలు జరగ్గా, అంతకు ముందు ఏడాది 706 అత్యాచారాలు నమోదయ్యాయి. రేప్ కేసుల్లో ఢిల్లీ తరువాత ముంబై(391), జైపూర్(192), పూణె (171) ఉన్నాయి. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల మేరకు మధ్యప్రదేశ్‌లో రోజుకు సగటున 11 అత్యాచారాలు చోటుచేసుకోగా, తర్వాత స్థానాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీలదే.

ఇదిలావుంటే, భారతదేశంలో ఆత్మహత్యలు కూడా ఎక్కువే జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2012లో మన దేశంలోనే ఆత్మహత్యలు అత్యధికంగా జరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక వెల్లడించింది. భూమిపై ప్రతి 40 సెకన్లకో ఆత్మహత్య నమోదవుతున్నట్టు అంచనా. ఆత్మహత్యల రేటు డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా రీజియన్‌లో అధికమని గణాంకాలు వెల్లడించాయి. 39 శాతం ఆత్మహత్యలు ఇక్కడే చోటు చేసుకొంటున్నాయని నివేదిక పేర్కొంది.
ఆగ్నేయాసియా ప్రాంతంలోని దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో ఇవి చోటుచేసుకొంటున్నాయి. అందులోనూ భారత్‌లోనే ఇవి అధికమని నివేదిక తెలిపింది. 2012లో దేశంలో 2,58,075 మంది బలవన్మరణం పొందారు. వీరిలో 1,58,098 మంది పురుషులు కాగా 99,977 మంది మహిళలు. భారత్‌లో లక్ష మందికి 21.1 మంది ఆత్మహత్య చేసుకొంటున్నట్టు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ డాక్టర్ శేఖర్ సక్సేనా తెలిపారు.
గయానా, ఉత్తర, దక్షిణ కొరియాలు, శ్రీలంక, లూధియానా, సురినాం, మొజాంబిక్, నేపాల్, టాంజేనియా, బురాండి, దక్షిణ సూడాన్‌దేశాల్లోనూ ఆత్మహత్యలు అధికమే. ఆస్ర్టేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో ఆత్మహత్యల వల్ల సంభవించే మరణాల సంఖ్య తక్కువేనని నివేదిక తెలిపింది.












Click it and Unblock the Notifications