ఐటి కంపెనీల్లో తెలంగాణ టెక్కీలపై వివక్షా?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు ఐటి కంపెనీలలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టిఐటిఏ) ఆదివారం ఓ నివేదికను విడుదల చేసింది. సుదీర్ఘ కాలంగా పలు ఐటీ కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంత ఇంజినీర్లు వివక్షతకు గురవుతున్నారని ఆ నివేదికలో పేర్కొంది.
హైదరాబాద్‌లోని 50 ఐటి కంపెనీల్లో 150 ఐటి ప్రాజెక్టులను పరిశీలించిన టిఐటిఏ.. ఈ ప్రాజెక్టులలో సుమారు 60శాతం మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారేనని, అత్యల్ప స్థాయిలో 16శాతం మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారున్నారని, మిగితా వారందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తన నివేదికలో తేల్చింది. ఐబిఎం, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ఎస్‌బిసి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, డెలోయిట్ట్, అక్సెంచర్ మొదలగు సంస్థల్లో టిఐటిఏ అధ్యయనం చేసింది.

ఈ కంపెనీల్లో ఉద్యోగులను నియమించే విభాగమైన మానవ వనరులు విభాగంలో సుమారు 66శాతం మంది సీమాంధ్రకు చెందిన అధికారులే ఉన్నారని టిఐటిఏ పేర్కొంది. అందువల్ల సీమాంధ్ర అధికారులు వారి ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను మాత్రమే నియమించుకుని, తెలంగాణ ప్రాంతం వారిపట్ల ఎన్నో ఏళ్లుగా వివక్ష చూపుతున్నారనేది తమ అధ్యయనం తేలిందని టిఐటిఏ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మఖ్తాలా తెలిపారు.
ఐటి కంపెనీల్లో ఉద్యోగాల నియామకం, ప్రమోషన్లలలో తెలంగాణ జిల్లాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వివక్షతకు గురవుతున్నట్లు తమ అధ్యయనం తేల్చిందని సందీప్ చెప్పారు. ఐటి సంస్థల్లో ఎంతో హుందాగా ఉండే అధికారులు ప్రాంతాల పేరుతో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిపై వివక్ష చూపిస్తున్నారని టిఐటిఏ పేర్కొంది.
టిఐటిఏ గౌరవ అధ్యక్షుడు, సలహాదారు వి ప్రకాశ్ మాట్లాడుతూ.. ఐటి కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న సీమాంధ్ర ప్రాంత అధికారులు ఆ ప్రాంతానికి చెందిన వారికే ఉన్నత పదవులు కట్టబెడుతూ.., తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని తక్కువ హోదాగల ఉద్యోగాల్లో నియామకం చేసుకుంటున్నారని ఆరోపించారు. తమ ప్రాంతానికి చెందిన టెక్కీలలో నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
ఐటీ రంగంలో ఉద్యోగాలను పొందే విషయంపై అవగాహన పెంపొందించేందుకు 200 కాలేజీలకు చెందిన 3వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులతో ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకాశ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని సీమాంధ్రులు ఆందోళన వ్యక్తం చేయడం దారుణమని ఆయన అన్నారు. ఐటి కంపెనీల్లో మైనార్టీలుగా ఉన్న తెలంగాణ ఉద్యోగులు వారి ఉద్యోగానికి ఏవిధంగా హాని చేయగలరని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications