తెలంగాణపై కాగ్ పెదవి ‘విరుపు’: అవాస్తవికత.. అంచనాల్లో వైఫల్యం..

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: బడ్జెట్‌ కేటాయింపుల్లో అవాస్తవికత.. భారీ స్థాయిలో మిగులు.. అవసరమైన అంచనాల్లోనూ వైఫల్యం.. అనవసరమైన అనుబంధ పద్దులు.. వివిధ పథకాలకు కేటాయింపులు లేకుండానే నిధుల ఖర్చు.. వివిధ పథకాలు, శాఖలకు అదనపు కేటాయింపులు జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వ పనితీరులో నిర్వహణా లోపాల్ని ఎత్తి చూపుతోందని కంప్ట్రోలర్‌, ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొన్నది. ఖర్చు కాని మొత్తాలు చివరన మురిగిపోవడంతోపాటు పీడీ ఖాతాల్లో ఎక్కువ నిల్వలు పేరుకుపోతున్న తీరు నిధుల వినియోగం తీరుపై పర్యవేక్షణ, నియంత్రణ లోపాలను స్పష్టంచేస్తున్నాయని వివరించింది. నిర్దిష్ఠమైన అవసరాలను వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా అంచనా వేయడంలో వైఫల్యం కారణంగా బడ్జెట్‌ కేటాయింపుల్లో కచ్చితత్వంపై కాగ్‌ సందేహాలు వ్యక్తంచేసింది.

అంతర్గత నియంత్రణ కట్టుదిట్టంగా లేదని విశ్లేషించింది. మూడు త్రైమాసికాల్లో 46% నిధులు, చివరి త్రైమాసికంలో 54% నిధులు ఖర్చు చేయడం ప్రభుత్వంలోని హడావుడిని సూచిస్తోందని పేర్కొంది. వ్యక్తిగత (పీడీ) ఖాతాల్లోని మిగులు నిధులను రెవెన్యూ రాబడులకు జమచేయాలని ఆదేశించి ప్రభుత్వం పద్దుల విధి విధాన నిబంధనలను అతిక్రమించిందని స్పష్టం చేసింది. దీంతో రెవెన్యూ రాబడులను రూ.4218 కోట్ల మేర ఎక్కువ చూపినట్లయిందని తెలిపింది. 2015-16లో వివిధ శాఖలు, పథకాలకు బడ్జెట్ కేటాయింపుల తీరు.. వాటి వ్యయంలో నిబంధనల ఉల్లంఘనల వైనాన్ని కాగ్‌ బహిర్గతం చేసింది. 'కాగ్' నివేదిక ముఖ్యాంశాలివి:

Unrealistic allocations in Telangana budget, says CAG report

బలహీనంగా వ్యయ పర్యవేక్షణ, నియంత్రణ

అవాస్తవంగా బడ్జెట్‌ అంచనాలు జరిపిన ప్రభుత్వం ఆయా పద్దుల వారీగా వ్యయం తీరును పర్యవేక్షించడంలో, నిధుల వినియోగంలో నియంత్రణ తీరు బలహీనంగా ఉన్నది. బడ్జెట్‌లో రూ.238 కోట్ల రెవెన్యూ మిగులు చూపినా.. అది వాస్తవ పద్దు కంటే ఎక్కువగా ఉంది. సహాయ గ్రాంట్లు రూ.151 కోట్లను క్యాపిటల్‌ పద్దు కింద వర్గీకరించడం, బడ్జెటేతర రుణాల నుంచి రూ.3719 కోట్లను రెవెన్యూ రాబడులకు క్రెడిట్‌ చేయడంతో రెవెన్యూ మిగులు ఎక్కువ చూపి, ద్రవ్యలోటు తక్కువ చూపింది. దీంతో ద్రవ్యలోటు రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.23% నుంచి 3.87 శాతానికి పెరిగింది.

నిబంధనలు భేఖాతర్

బడ్జెట్‌ కేటాయింపులకు మించి రూ.5,881 కోట్లు ఖర్చు చేయడం, అసలు కేటాయింపులే లేని పథకాలకు రూ.2161 కోట్లు ఖర్చు చేయడం బడ్జెట్‌ ప్రక్రియలో శాసనపర నియంత్రణను బలహీనపరిచే చర్యేనని స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం లేకుండా రూ.3159 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. వ్యక్తిగత ఖాతాల (పీడీ అకౌంట్లు) నుంచి రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ డ్రా చేయడానికి ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉండాలి. దీన్నిఅతిక్రమించి మార్చి నెలలోనే 384 చెక్కుల ద్వారా రూ.3159 కోట్లు డ్రా చేశారు. దీనికి హైదరాబాద్‌ అర్బన్‌ జిల్లా ట్రెజరరీ అధికారి అనుమతి మంజూరు చేసేశారు.

Unrealistic allocations in Telangana budget, says CAG report

బడ్జెట్ కచ్ఛితత్వంపై సందేహాలివి:

బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, రహదారులు, భవనాల శాఖ, నీటిపారుదల శాఖల్లోనే రూ.15,385 కోట్ల మిగులు ఉంది. ఇది బడ్జెట్‌ కచ్చితత్వంపైసందేహాలను వెల్లడిస్తోంది. కొన్ని శాఖలు, పథకాల కింద నిధులు ఖర్చు చేయకున్నా అనుబంధ కేటాయింపులు చేశారు. 38 అంశాల్లో రూ.8946 కోట్ల అనుబంధ కేటాయింపులు అనవసరం. ఇదిలా ఉంటే తొలి కేటాయింపులు అధికంగా ఉన్నా పాఠశాల విద్య, పురపాలన, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి తిరిగి కేటాయింపులు జరిపారు. 288 ఉపపద్దుల్లో రూ.31,502 కోట్లు వ్యయం చేయకుండా తిరిగి అప్పగించారు. 85 పద్దులలో రూ.8715 కోట్లలో నయా పైసా కూడా ఖర్చు చేయలేదు.

ఇవీ నియంత్రణ ప్లస్ పర్యవేక్షణ లోపాలు

బడ్జెట్‌ అంచనాల్లో గంపగుత్త కేటాయింపులు చేయకూడదని మాన్యువల్‌ నిబంధన. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పద్దు కింద రూ.55కోట్లు కేటాయింపులు జరిపింది. మిగులు కంటే ఎక్కువ నిధులను సరెండర్‌ చేయడం బడ్జెట్‌ నియంత్రణ, పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తున్నది. ఎస్సీ ఉప ప్రణాళికలో 48 %, ఎస్టీ ఉప ప్రణాళికలో 49 % నిధులే ఖర్చు చేశారు. సినరేజీ రుసుం రూ.434 కోట్లు వసూలైతే రూ.19.36 కోట్లు మాత్రమే విడుదల చేశారు. వాడుకలో లేని ఉప పద్దుల నిర్వహణలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రెజరీ శాఖ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా 39 ఉపపద్దులను తెరిచారు.

అసెంబ్లీ ఆమోదం లేకుండా నిధుల ఖర్చు

రాష్ట్ర ప్రభుత్వం 2015-16లో రూ.5881 కోట్లను అసెంబ్లీ ఆమోదం లేకుండా ఖర్చు చేసింది. వ్యక్తిగత ఖాతా (పీడీ)ల్లో అవకతవకలు ఉన్నాయి. 29,311 పీడీ ఖాతాల్లో 2016 మార్చినాటికి రూ.8019 కోట్లు నిల్వ ఉంది. వాటిని పీడీ ఖాతాలకు బదిలీ చేశారు. జిల్లా పరిషత్‌ భవిష్య నిధికి వడ్డీతో కూడిన డిపాజిట్ల కోసం రూ.716 కోట్లు బడ్జెట్‌లోనే కేటాయించాల్సి ఉన్నా.. నిధుల కేటాయింపులే లేవు. రూ.3532 కోట్ల నిధుల వినియోగంపై 10, 852 ఓచర్లు రాకపోవడం.. నిధుల స్వాహా, అక్రమాల వంటి సందేహాలకు తావిస్తోంది.

నిరాశాజనకంగా జౌళి పార్కుల పనితీరు

రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కల్పన, ఎగుమతుల పెంపుదల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద చేపట్టిన జౌళిపార్కుల పనితీరు నిరాశాజనకంగా ఉన్నదని కాగ్‌ పేర్కొంది. పార్కుల నిర్మాణంలో ఏడు నెలల నుంచి 151 నెలల వరకు జాప్యం జరిగింది. సిరిసిల్లలో నిర్మాణ పనుల్లో జాప్యం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం రూ.104 కోట్ల ఆర్థికసాయాన్ని కోల్పోయింది. సిరిసిల్ల జౌళి పార్కులు, వైట్‌గోల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్పిన్‌టెక్స్‌ పార్కులకు రాష్ట్రప్రభుత్వం రూ.6.04 కోట్లు, కేంద్రప్రభుత్వం రూ.14.34 కోట్లు ఖర్చు చేసినా లబ్ధి చేకూరలేదు.

రూ.4.51 కోట్ల 'రవాణా'ఆదాయానికి గండి

రవాణాశాఖ ఆదాయానికి రూ.4.51 కోట్ల మేర గండి పడినట్లు కాగ్‌ గుర్తించింది. 2011-12 నుంచి 2014-15 వరకూ 1,213 రవాణా వాహన యజమానుల నుంచి రూ.1.80 కోట్ల వాహన పన్ను, రూ.90 లక్షల అపరాధ రుసుము వసూలు కాలేదు. 53,556 రవాణా వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పునరుద్ధరించకపోవడంతో రూ.1.19 కోట్లు వసూలు కాలేదు. 568 వాహన తనిఖీ నివేదిక పరిశీలనలో రూ.31.29 లక్షల మేర, మహారాష్ట్రలో రిజిస్టరైన 253 రవాణా వాహనాల నుంచి 2014-15లో రెండేళ్లకు రూ.15.69 లక్షల అపరాధ రుసుములు వసూలు కాలేదని గుర్తించారు.

సిబ్బంది చేతివాటం.. అక్రమాలు బాహాటం

ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సిబ్బంది చేతివాటం ఎక్కువైందని కాగ్‌ పరిశీలనలో తేలింది. రాష్ట్రంలో 2014లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వాహనాల అద్దెలు, ఇంధన ఖర్చుల పేర సిబ్బంది చేతివాటాన్నే కనబర్చినట్టు తనిఖీ నివేదికలు చెప్తున్నాయి. ఎంపీడీవోలు వినియోగించినట్లుగా పేర్కొంటూ వాహన నెంబర్లతో సహా సమర్పించిన ఓచర్లను కాగ్‌ పరిశీలించగా వివిధ అక్రమాలు బయటపడ్డాయి. ఆర్టీఏ రికార్డులతో మచ్చుకు 76 ఓచర్లను సరిపోల్చినప్పుడు వాటిలోని వాహనాల నెంబర్లు ద్విచక్రవాహనాలవని తేలింది. మరో 215 ఓచర్లలోని వాహనాల నెంబర్ల ఆచూకీ లభించలేదు. మరో 405 ఓచర్లలో వాహనాల నెంబర్లనే సిబ్బంది రాయలేదని తేలింది.

వృద్ధాప్య పింఛన్లు సరే... సంరక్షణ సంగతేమిటి?

రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల చెల్లింపు విషయంలో రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయమైనా తల్లిదండ్రులు, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమచట్టం కార్యక్రమాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నదని కాగ్‌ పేర్కొంది. చట్టంలోనూ, నియమాల్లోనూ, వయోవృద్ధులకు కల్పించిన పథకాలపై అవగాహన కల్పించడంతోనూ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. నిరుపేద వృద్ధులకు తగినన్ని వృద్ధాశ్రమాలు లేవు. వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడంతోపాటు జిల్లాకో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని 'కాగ్' సూచించింది.

రోడ్ల పనుల్లో కాంట్రాక్టర్లకు ఆయాచిత లబ్ధి

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి చేపట్టిన పనుల్లో ప్రభుత్వ నిర్ణయాలు కాంట్రాక్టర్లకు ఆయాచిత లభ్ధి చేకూర్చేలా ఉన్నాయని కాగ్‌ పరిశీలనలో తేలింది. రహదారుల మెరుగుదలకు నిధుల లేమిని అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం, అంతర్జాతీయ అభివృద్ధి పునర్నిర్మాణ బ్యాంకు మధ్య 2010లో రుణ ఒప్పందం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుని తెలంగాణకి రూ. 66.5 మిలియన్ల యూఎస్‌ డాలర్లను కేంద్రం కేటాయించింది. ఆ ఒప్పందం ప్రకారం ఆ రహదారుల పనులను 2015 మార్చి నాటికి పూర్తి చేయాలి. 2017 మే వరకు పొడిగించారు. కంది-షాద్‌నగర్‌ మార్గంలో పనులు నిరాశాజనకంగా ఉండటంతో ఒప్పందాన్ని రద్దు చేయాలని సలహాదారు సిఫార్సు చేశారు. ఒప్పందాన్ని రద్దు చేయకపోగా రూ.10 కోట్ల పూచికత్తుతో 2017 మే వరకు గడువు పొడిగించింది. పనుల జాప్యానికి కాంట్రాక్టర్ నుంచి పరిహారం కూడా వసూలు చేయలేదు.

అధ్వాన పనితీరుతో విద్యుత్‌ సంస్థలకు నష్టాలు

తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల అధ్వాన పనితీరువల్ల పలు విభాగాల్లో కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నాయని కాగ్‌ అధ్యయనంలో తేలింది. గత ఏడాది వరకు వ్యవసాయానికి రోజూ 7 గంటలు విద్యుత్ సరఫరా చేశామని చెబుతూ డిస్కంలు రాయితీ నిధులు పొందుతున్నాయి. వాస్తవంగా రోజుకు ఆరు గంటలు.. అంతకన్నా తక్కువ సమయమే విద్యుత్ సరఫరా జరిగినట్లు తేలింది. డిస్కంలు 2011-16 మధ్య కాలంలో రాయితీపద్దు కింద రూ.8,237.63 కోట్లు తీసుకున్నాయి. ఇందులో రూ.1,176.80 కోట్లు కరెంటు ఇవ్వకుండానే తీసుకున్నాయి. రాష్ట్రంలో అత్యధిక వర్గాలకు జాతీయ ఛార్జీల పథకానికి విరుద్ధంగా ఎక్కువ ఛార్జీలను నిర్ణయించి రూ.909.37 కోట్లు అదనంగా వసూలు చేశారు. పేదల పేరుతో రాయితీకింద తీసుకున్న సొమ్ముకు సరిపడా విద్యుత్‌ను డిస్కంలు సరఫరా చేయలేదు. ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ 2010-11లో రూ.3.20కోట్ల లాభంతో ఉంటే పనితీరు సరిగా లేక 2015-16 నాటికి రూ.1,010.08 కోట్ల నష్టం ఏర్పడింది.

'ఉపాధి' లేని వారికి నిరుద్యోగ భృతి ఇవ్వరా?

ఉపాధి హామీ పని పొందలేక పోయినవారికి నిరుద్యోగ భృతిని చెల్లించాలనే నిబంధన తెలంగాణలో అమలుకావటంలేదు. మరోవైపు పంచాయతీరాజ్‌ సంస్థల ఆర్థికస్థితికి సమగ్ర రూపాన్ని ఇచ్చేందుకు కావాల్సిన ప్రణాళికేదీ ఇంతవరకూ తయారు కాలేదు. రాష్ట్రంలో 2013-16 మధ్య 2.13లక్షల మంది కూలీలకు 15రోజుల వ్యవధిలోగా ప్రభుత్వం 'ఉపాధి' పనులను కల్పించలేకపోయింది. ఇందుకు కూలీలకు రూ.106 కోట్ల నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉండగా ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. పంచాయతీరాజ్‌ సంస్థలకు రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలను బదిలీ చేయాల్సిన రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు 10 అంశాలనే బదిలీ చేసింది. పంచాయతీరాజ్‌ సంస్థల్లో జరిగిన సామాజిక తనిఖీల్లో కనుగొన్న నిధుల మళ్లింపులను రాబట్టుకోలేకపోవటం, సక్రమంగా స్టాకు రిజిస్టర్లు, క్యాష్‌ బుక్‌లను నిర్వహించకపోవడం వంటి లొసుగులు స్పష్టంగా కానవచ్చాయని కాగ్ నివేదికలో పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CAG report says in 2015 16 financial year Telangana budget allocations unrealistic, maintanance failures clearly indicated.
Please Wait while comments are loading...