తెలంగాణ: వైయస్ ఢిల్లీ యాత్ర

ఇదిలా ఉంటే, ఇదే సమయంలో ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో మకాం పెడుతున్నారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలుసుకుంటారు. ఈ నెల కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమావేశానికి ముందే తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడాలని పార్టీ అధిష్ఠానవర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రతిసారీ ఏదో రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగా నిలబడుతున్నారు. గత ఢిల్లీ పర్యటనలో కూడా తెలంగాణ అంశం ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అందువల్లనే మజ్లీస్ ముఖ్యమంత్రి అడ్డుపెట్టారనే విమర్శ ఉంది. తెలుగుదేశం, ప్రజారాజ్యం, సిపిఐ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతోనే కాకుండా తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెలంగాణను ఏర్పాటు చేస్తామని బిజెపి అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ సికింద్రాబాదు బహిరంగ సభలో చెప్పారు. దీంతో కాంగ్రెసు పార్టీ ఇరకాటంలో పడింది. ఏమీ తేల్చకుండా ముందుకు సాగడం సాధ్యం కాదనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా, గత ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, తెరాసలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెసుకు మిత్రులు ఒక్కరొక్కరే దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా పోటీ చేయడం కూడా సాధ్యం కాదనే అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల తెరాసతో పొత్తు పెట్టుకోవడానికి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన చేసిందని, నిర్ణయం కూడా దాదాపుగా ఖరారైందని, ముఖ్యమంత్రిని ఒప్పించడమే మిగిలి ఉందని అంటున్నారు.
ఏమైనా తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ ఒంటరిదైంది. ఈ వాతావరణంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా ప్రజల్లోకి వెళ్లడం కష్టమనే భావన పార్టీ నాయకుల్లో వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications