ముందైతే కాంగ్రెస్: తర్వాతైతే బిజెపి
వద్దు వద్దు అన్నవాళ్లే తెలంగాణ ఇస్తాం ఇస్తాం అంటున్నారు. ఎవరి ప్రయోజనాలు ఏవైనా, ఎవరి వ్యూహం వారికున్నా సగటు తెలంగాణవాది మాత్రం ఎన్నికల ముందరి ఈ స్థితిని చూసి సంబరపడుతున్నాడు. అరవై ఏళ్లుగా ఉత్తుత్తి ఉద్యమాలు చేసినవారు, దొంగ ఉద్యమాల నాయకులు, ఎవరెవరినో నమ్మి ఆశపడి ఉద్రిక్త పడ్డ తెలంగాణ ప్రేమికులు, నిజాయితీ గల ఉద్యమకారులు ఈ సందర్భాన్ని చూసి నిజంగా ఆనందిస్తున్నారు.
మాకు ఓటెయ్యండి, గద్దెనెక్కిన నూరు రోజుల్లో తెలంగాణ ఇస్తామని నోరారా లక్షలాది మంది జనం ఉన్న నిండు సభలో బిజెపి ప్రధాని అభ్యర్థి అయిన ఎల్.కె. అద్వానీ ఆన వేసి మరీ చెప్పారు. నిజంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆయన మాట తప్పే ఆస్కారమే లేదు. అడ్డుపడే అవకాశం ఉన్న ఒక్క వెంకయ్యనాయుడు కూడా నోరారా జై తెలంగాణ అని అన్నారు. జై తెలంగాణ అనకపోతే మళ్లీ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ వారు అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి తమ కులంవారికి నూకలు పుట్టనివ్వని పరిస్థితి తెస్తారని గ్రహించారు కాబట్టే వెంకయ్యగారు తెలంగాణ అని నోరారా అన్నారు. వచ్చే కార్తిక పౌర్ణమి నాటికి ప్రత్యేక తెలంగాణ వస్తుందని, కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే ఇద్దరికి సుఖం అని ఆయన కొత్త నానుడిని రూపొందించి కార్తిక పౌర్ణమి వెలుగులో హామీ ఇచ్చారు. విశ్వసనీయత నాకు ప్రాణంతో సమానం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, ఒట్టేసి చెబుతున్నా మాకు ఓటివ్వండి మైరు తెలంగాణను తీసుకోండి అని అద్వానీ వివరించారు. దీన్ని మెజారిటీ తెలంగాణ ప్రజలు విశ్వసించారు.
ఇదిలా ఉండగా అటు కాంగ్రెస్ తెలంగాణ విషయమై అధిష్ఠానం కూడా ఒక నిర్ణయానికి రావడానికి సంసిద్ధమైనట్లు తెలుస్తున్నది. తెలంగాణ ఇవ్వకపోతే గ్యారంటీగా నష్టపోతాం, ఇస్తే సగం సీట్లయినా గ్యారంటీ అని రాజకీయాలు తెలిసిన ఢిల్లీ పండితులు భావిస్తున్నారు. మీకెందుకు, ఆంధ్రప్రదేశ్ విషయం నాకు వదిలేయండి, నేను పార్టీని గెలిపించి తెస్తాను అని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బీరాలు పోతున్నారు. ఇక పిసిసి అధ్యక్షుడితో సహా వెంకటస్వామి, హనుమంతరావు తదితర సీనియర్ నాయకుల నోళ్లను అధిష్ఠానం బూచిని చూపి మూయించే ప్రయత్నం చేస్తున్నారు. చంచాలుగా, తాబేదార్లుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, శాసనసభ్యులు నోరు మూసుకుంటే మొత్తం తెలంగాణ అంతా నోరు మూసుకున్నట్లు కాదు. తన చుట్టు ఉన్న మీడియోకర్ మీడియా వారిని మచ్చిక చేసుకుంటే మొత్తం మీడియా జనం మచ్చికయినట్లు కాదు.
రాయలసీమ వారి ఔదార్యాన్ని, ఫ్యూడల్ ధోరణిని, వీరత్వాన్ని చవి చూసిన తెలంగాణ రెడ్డిజనం, తెలంగాణ కాంగ్రెస్ వారు ఇప్పటికే వారి విషయమై ఒక అవగాహనకు వచ్చారు. కోట్ల రూపాయలు కొట్టేసి వేలల్లో లక్షల్లో ఔదార్యాన్ని చూపడం, లేస్తే మనిషిని కాదని కడప ఫ్యాక్షన్ బాంబుల బూచిని చూపి రియల్ ఎస్టేట్ దందాలు చేయడం, ఒక పనిలో సింహ భాగం మాది ఎంగిలి మెతుకులు మీవి అనే ఫ్యూడల్ ధోరణి పట్ల తెలంగాణ కాంగ్రెస్ నాయకగణాలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
భూముల అమ్మకం, సెజ్ లు, కోస్టల్ కారిడార్, వోక్స్ వ్యాగన్, అయేషా హత్య కేసు, మొద్దు శీను జైలు హత్య, బాలకృష్ణ హత్యాయత్నం లాంటి కేసుల్లో ప్రభుత్వం ఎంత నిజాయితీగా ప్రవర్తించిందో జనం గమనిస్తున్నది. వరణ దేవుడి కరుణ అపారంగా ప్రసరించినా రియల్ ఎస్టేట్ బూమ్ బుస్సున తగ్గి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. భూతల్లిని చెరపట్టినందుకు పాలకుల్ని ఆ తల్లి శపించిందా అన్నట్లు ప్రభుత్వం దివాళా తీయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్థితిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) గుడ్డిగా ముఖ్యమంత్రి మాట విని తెలంగాణను వాయిదా వేసి రిస్క్ తీసుకుంటుందని రాజకీయాలు అవగతం చేసుకున్నవారు ఎవరూ అనుకోవడం లేదు.
మరో వైపు బిఎస్పీ నేత మాయావతి తెలంగాణ పట్ల పూర్తిగా సానుకూలంగా అన్నారు. ములాయం మెదడులో ఏ పురుగు మెదిలిందో గానీ తెలంగాణను నిరసిస్తూ ఏవో పిచ్చి మాటలు మాట్లాడారు. అతని మాటల వల్ల వచ్చే తేడా ఏమీ ఉండదు గానీ అనవసరంగా ఆయన తెలంగాణ ప్రేమికులకు ఆప్రియుడయ్యాడు. మాయావతి కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సింగూరులో టాటాల ఫ్యాక్టరీ తరలింపు, అవినీతి వల్ల సిపిఎం ఈసారి గెలవని పరిస్థితిని ఏర్పరచుకుంది. సీట్లు మారే ఈ నెంబర్ గేమ్ లో మాయావతి కూడా ప్రధాని అయ్యే అవకాశాలు తక్కువగా ఏమీ లేవు. వీటన్నిటి దృష్ట్యా కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పట్ల సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. తెలంగాణ బిల్లు తయారు చేసే పనిని ప్రణబ్ ముఖర్జీకి అప్పగించినట్లు కూడా అనధికార వార్తలు వస్తున్నాయి.
ఎల్ కె అద్వానీ నూరు రోజుల్లో తెలంగాణ ఇస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను వంచించిందని, నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. ఈ విమర్శ సోనియా గాంధీ చెవిన కూడా పడుతుంది. ఎంత ఇటాలియన్ వనిత అయినా మాటల్లోని అంతరార్థం గ్రహించలేని స్థితిలో ఆమె ఏమీ ఉండరు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇచ్చే ధన, వస్తు, కనకాది కానుకల మాయలో పడకపోవచ్చు. సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులకు డబ్బులు లేవు, కేంద్రమే ఆదుకోవాలి అని రాజశేఖర రెడ్డి బహిరంగ విజ్ఞప్తిని కేంద్రానికి చేశారు. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉందని కాంగ్రెస్ అధిష్ఠానానికి అర్థమయ్యే ఉంటుంది.
తెలంగాణ విషయాన్ని ఉపేక్షిస్తే కాంగ్రెసుకు బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పట్టిన గతే పడుతుందని కాంగ్రెస్ పెద్దలు గ్రహించలేనంత గుడ్డిగా ఉంటారని అనుకోవడానికి లేదు. తెంలగాణను ప్రకటించడం ద్వారా బిజెపి వ్యూహాన్ని తిప్పికొట్టడంతో పాటు అనేక అనుకూలతలు కాంగ్రెస్ పొందవచ్చు. ఉదాహరణకు రాష్ట్రంలో ఉప్పెనలా ముందుకు వస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఒక్క వేటుతో తెలంగాణలో జీరో చేయవచ్చు. ఎన్నికలకు ముందే గనుక తెలంగాణను ఏర్పరిస్తే ప్రజారాజ్యం పార్టీకి తెలంగాణతో సంబంధం ఉండదు. అలాగే తెలుగుదేశం పార్టీ సగానికి సగం బలహీనపడుతుంది. ఏది ఏమైనా టీఆర్ఎస్ లాంటి పార్టీతో కూటమి కడితే కాంగ్రెస్ 17 పార్లమెంటు సీట్లలో 16 సాధించుకోవచ్చు. ఆంధ్ర ప్రాంతంలో లగడపాటి రాజగోపాల్ వంటి తుంపర్ల బలంగల వారు కొందరైనా మళ్లీ గెలుస్తారు. రాయలసీమలో ముఖ్యమంత్రి అంగఅర్థ బలాలతో సగం కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తారు. దీంతో చెప్పుకోదగిన బలంతో ఎంపి సీట్లు కాంగ్రెస్ పార్టీవారికి వచ్చే అవకాశం ఉంది. చాలు, నిండా ఐదేళ్లు ఇష్టారాజ్యంగా విశాల ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించావు. చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవచ్చు. భవిష్యత్తులో కేంద్రంలో ముఖ్యమైన క్యాబినెట్ మంత్రి అయిపోవచ్చు అని ఢిల్లీ పెద్దలు రాజశేఖర రెడ్డిని ఊరడించవచ్చు. లేదంటే ఓటమి ద్వారా అటు ఢిల్లీలో కాంగ్రెసుకు అతిగతీ ఉండదు. ఎన్నికల అనంతరం నూరు రోజుల్లో ఏర్పడే నూతన రాష్ట్రం తెలంగాణలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జీరో కావడం ఖాయం. రాష్ట్రాన్ని మనసా వాచా వ్యతిరేకించిన వ్యక్తిగా ఆయన నూతన రాష్ట్రంలో బహిరంగంగా ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఢిల్లీలోను కాంగ్రెసుకు బిచానా ఉండదు కాబట్టి అప్పుడు ఇడుపులపాయలో శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాల్సిందే. తెలంగాణ వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోవాల్సిందే. ఆయనతో పాటు ఆయనకు వంత పాడిన మెజారిటీ కాంగ్రెస్ తెలంగాణ రెడ్లు, టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెసుతో అంటకాగిన జగ్గారెడ్డి, సంతోష్ రెడద్డి తదితరులు తెలంగాణ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోవాల్సిందే.












Click it and Unblock the Notifications