అల్లు అరవిందే టార్గెట్
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బావ మరిది అల్లు అరవిందే అందరి టార్గెట్ గా మారినట్లు పరిస్థితి కనిపిస్తోంది. పార్టీపై అసంతృప్తి చెందినవారంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అల్లు అరవింద్ పైనే విరుచుకు పడుతున్నారు. తమకు టికెట్లు రాకపోవడానికి అల్లు అరవింద్ కారణమని వారు లోలోపల అక్కసుతో ఉన్నట్లు సమాచారం. చిరంజీవికి తమకు ఆయన అడ్డుగా నిలిచారని, దాంతో తమ అభిప్రాయాలు చిరంజీవికి చేరడం లేదని పార్టీలో బలమైన అభిప్రాయం నెలకొని ఉంది. చిరంజీవి కూడా ఏం చేయలేని పరిస్థితిలో పడినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. చిరంజీవికి ప్రజల్లో క్రమక్రమంగా ఆదరణ తగ్గుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కరీంనగర్ సభ వెలవెల బోవడం అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
పార్టీని గెలిపించడానికి తన ప్రచారం తప్ప మరో గత్యంతరం లేదని కూడా ఆయనకు తెలిసి వచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రమంతా తిరగడానికి కూడా ఆయనకు తగిన వ్యవధి లేదు. దీంతో పోలింగ్ ముగిసే వరకు ఏదో ఒక విధంగా ప్రచారం చేశాననిపించాలని ఆయన అనుకున్నట్లు భావిస్తున్నారు. దాంతో ఆయన రైలు యాత్రను పెట్టుకున్నారని చెబుతున్నారు. ప్రజా రైలు యాత్రలో పవన్, రామచరణ్ తేజా, పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఆయన ఇంతకు ముందు చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ తొలి రోజు చిరంజీవితో పాటు రైలు యాత్రలో లేరు. మరో చోట ఆయన ప్రచారంలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో పార్టీని విడిపోతున్న నాయకులను చూసి చిరంజీవి తీవ్ర మనస్థాపానికి కూడా గురైనట్లు తెలుస్తోంది. మిత్రా విషయంలో ఆయన వ్యవహరించిన తీరే ఇందుకు అద్దం పడుతుందని చెబుతున్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడే సమయంలో గమ్మత్తయిన సంఘటన చోటు చేసుకుంది. చిరంజీవి వేదికపై కూర్చున్న సమయంలో మిత్రా కింద ఉన్నారు. మిత్రాను చిరంజీవి పైకి ఆహ్వానించారు. దీంతో మిత్రా పైకి రాగానే మీరు పార్టీలో ఉన్నారా, లేరా అని చిరంజీవి కన్ను గీటుతూ అడిగారు. ఇది మిత్రాను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. చిరంజీవి నిస్పృహతోనే మాట అన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
చిరంజీవికి అల్లు అరవింద్ కాపలాగా ఉన్నారు. దశాబ్దాలుగా తాను చిరంజీవిని రక్షించుకుంటూ వస్తున్నానని కూడా అల్లు అరవింద్ చెప్పుకున్నారు. ఆయన వల్లనే పాత మిత్రులు చాలా మంది చిరంజీవికి సినీ రంగంలో దూరమైనట్లు చెప్తారు. అయితే, సినిమా రంగంలో అది పెద్ద నష్టంగా కనిపించలేదు. రాజకీయాలకు వచ్చేసరికి దాని ప్రభావం కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీలో సీనియర్లు కూడా పని లేక చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక రకంగా వారికి పార్టీలో గాలి ఆడడం లేదు. రాజీనామా చేసేవారంతా టిక్కెట్లు రాకనే వెళ్లిపోయారని అనడంలో కూడా నిజం లేదనిపిస్తుంది. పార్టీ వ్యవహర శైలి వల్ల, చిరంజీవితో మాట్లాడి తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లేనందు వల్ల సీనియర్లు చాలా మంది అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని పట్టించుకునే వారు పార్టీలో లేరు. అంతా అల్లు అరవింద్ చుట్టే తిరుగుతుండడం వల్ల అది ఒక కుటుంబానికి సంబంధించి వ్యవహారంగా మారింది. ఈ స్థితిలో అల్లు అరవింద్ అందరికీ ప్రధామైన లక్ష్యం కావడంలో అశ్చర్యమేమీ లేదు.












Click it and Unblock the Notifications