రేణుకా చౌదరిపై బాబు ప్రతీకారం

ఖమ్మం జిల్లాలో సిపిఐ, సిపిఎంల ప్రాబల్యం ఉంటుంది. దాంతో పొత్తులో భాగంగా ఆ సీటు వామపక్షాలకు వెళ్లడం ఒక సంప్రదాయంగా మారింది. అయితే ఈసారి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థియే ఆ సీటులో పోటీకి దిగారు. రేణుకా చౌదరి ఓడించే ఏకైక లక్ష్యంతో, ఆమెను ఓడించి ప్రతీకారం తీర్చుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు. రేణుకా చౌదరి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. హైదరాబాదులో స్వర్గీయ పి. జనార్దన్ రెడ్డిపై తొడ కొట్టి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆ రకంగా ఆమె రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు. హైదరాబాద్ నగర పాలక సంస్థకు కార్పోరేటర్ గా కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదాలు వచ్చి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో చేరారు. తనకున్న చొరవతో ఖమ్మం లోకసభ స్థానం నుంచి 2004 ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా కేంద్ర మంత్రి కూడా అయ్యారు.
కాంగ్రెసు అధిష్ఠానం వద్ద ప్రాబల్యం సంపాదించుకున్న రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో తనకు తిరుగు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో జలగం కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పని చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే జలగం వెంకట్రావుకు అసెంబ్లీ టిక్కెట్ దక్కలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి తన ఖమ్మం జిల్లా పర్యటనలో జలగం వెంకటరావు అనుచరుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. జలగం వెంకటరావుకు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కొంత కటువుగా కూడా మాట్లాడారు. దీంతో జలగం కుటుంబ సభ్యులు రేణుకా చౌదరిని ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రేణుకా చౌదరి ముప్పేట దాడిలో తలమునకలవుతున్నారు.












Click it and Unblock the Notifications