వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాదే అసలు సమస్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
రాష్ట్ర విభజనకు ఇప్పుడు హైదరాబాద్ నగరమే అసలు సమస్యగా మారిన సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాదులో ఆస్తులు సంపాదించుకున్న కోస్తాంధ్ర, రాయలసీమ నేతలు తమ ఆస్తుల కోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాదును అభివృద్ధి చేశామని చెబుతున్న కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులు చాలా మంది నగరంలోనూ, దాని పరిసరాల్లోనూ పెద్ద యెత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఎకరాల కొద్ది భూములను సొంతం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. పరిశ్రమలు కూడా స్థాపించారు. అయితే, అవి తెలంగాణ ప్రయోజనం కోసం కాదనే వాదన తెలంగాణ నుంచి బలంగా వినిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వంటి అనుత్పాదక వ్యాపారాల ద్వారా తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టారనే ఆరోపణలున్నాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి హెరిటేజ్ ఫుడ్స్ ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మదర్ డైరీని నీరు గార్చి ఆయన హెరిటేజ్ పాల ఉత్పత్తులను పెంచి వ్యాపారం సాగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతర కోస్తాంద్ర నాయకులకు కూడా అటువంటి వ్యాపారాలున్నాయనే ప్రచారం ఉంది. హైదరాబాదులో ఐటి పరిశ్రమను స్థాపించింది తానేనని చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే, వందలాది ఎకరాలను నామమాత్రం ధరలకు ఆయన ఐటి సంస్థలకు, ఇతర సంస్థలకు కట్టబెట్టారు. అలాగే కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు ల్యాంక్ హిల్స్ ఉంది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. ఆయన వక్ఫ్ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెసు నాయకులు వైయస్ జగన్, వైయస్ వివేకానంద రెడ్డి వంటి రాజకీయ నాయకులే కాకుండా వైయస్ మరణం సమయంలో జగన్ ను పరామర్శించడానికి వచ్చిన పలువురు సినీ నటులు కూడా భూముల కబ్జాల్లో ఉన్నట్లు గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గతంలో ఆరోపించారు. తెలుగుదేశం నాయకుడు, సినీ నటుడు మురళీమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పేరెన్నిక గన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికే హైదరాబాద్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. శాసనసభ, హైకోర్టు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు వంటి అనేక ప్రభుత్వ కార్యాలయాలకు తగిన భవంతులున్నాయి. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వ కార్యాలయాలు శిబిరాల కింది నుంచే నడిచాయి. ఏ విధమైన మౌలిక వసతులు ఆంధ్ర రాష్ట్రానికి లేవు. కాగా, హైదరాబాద్ అప్పటికే ప్రపంచంలో పేరెన్నిక గన్న నగరం. నిజాం కాలంలోనే హైదరాబాద్ ఐదో పెద్ద నగరంగా, సంపన్న నగరంగా పేరెన్నిక గన్నది. నిజాం హయాంలోనే నీటి వసతులు ఏర్పడ్డాయి. సరస్సులు ఏర్పడ్డాయి. ఆల్విన్, ఆజం మిల్స్, చార్మినార్, డిబిఆర్ మిల్స్, నిజాం షుగర్స్ వంటి ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెందాయి. అవి దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు అందుకున్నాయి. వాటి మూతకు ప్రభుత్వాలు సమర్థంగా పనిచేసి కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల వాణిజ్యాలకు హైదరాబాదును కేంద్రంగా మార్చారు. అదే వారు చెబుతున్న అభివృద్ధి.

హైదరాబాద్ తెలంగాణ జిల్లాలకు నట్టనడుమ ఉండడం, విడిగా ఉంచే భౌగోళిక పరిస్థితులు లేకపోవడం వల్ల తమ ఆస్తుల రక్షణ కోసం, ఇక్కడి వనరులపై తమ ఆధిపత్యం కోసం కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్నారనే విమర్శలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X