నడిపించెడి వాడు కెవిపి

ఇప్పటికే కాంగ్రెసు సీనియర్ నాయకులు ఆ లాబీకి వ్యతిరేకంగా ఒక్కటి కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న కెవిపి తనదైన రీతిలో చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు కాంగ్రెసుకు శాసనసభలో స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది. అయితే వైయస్ జగన్ కు వందకు పైగా కాంగ్రెసు శాసనసభ్యులు మద్దతిస్తారు. వైయస్ అనుయాయులకు మాత్రమే టికెట్లు లభించి వారే ఎక్కువ విజయం సాధించడం ఇప్పుడు జగన్ కు కలిసి వస్తోంది. రోశయ్యను ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం ముఖ్యమత్రిగా కొనసాగించి, జగన్ ను పార్టీ అధిష్ఠానవర్గం పక్కన పెడుతుందనే భయం కూడా వైయస్ వర్గాల్లో ఉంది. దీంతో ఒత్తిడి తీవ్రం చేస్తున్నారు. మరోసారి మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయడానికి రఘువీరారెడ్డి, రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, అహ్మదుల్లా వంటివారు నిరాకరించారు. ప్రమాణ స్వీకారానికి ముందు కెవిపి నివాసంలో మంత్రులు సమావేశమయ్యారు. కెవిపి నచ్చజెప్పిన తర్వాతనే వారు మంత్రులుగా ప్రమాణం చేయడానికి సిద్ధపడ్డారు.
తెలంగాణలో మొదటిసారి మంత్రులైనవారు, శాసనసభ్యులుగా ఎన్నికైన వారు పూర్తిగా జగన్ నాయకత్వానికి మద్దతు కూడగడుతున్నారు. అయితే, కొద్ది మంది సీనియర్లు, వైయస్ వ్యతిరేకులు జగన్ కు మద్దతు ఇవ్వకపోతే ప్రమాదం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో కెవిపి ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కదిపినట్లు సమాచారం. స్థిరమైన ప్రభుత్వం ఉండాలనే నెపంతో, మళ్లీ ఎన్నికలు ప్రజలకు భారమనే మాటతో చిరంజీవి జగన్ కు మద్దతు ప్రకటించినా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద కెవిపి రామచందరావు జగన్ నాయకత్వంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి శాయశక్తులా పాటు పడుతున్నారు. జగన్ నాయకత్వం వల్ల వైయస్ లాబీ ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఉంటాయి. యథాతథ స్థితి కొనసాగుతుంది. జగన్ ముందు కనిపించినా వెనక నడిపించేదంతా కెవిపియే.


Click it and Unblock the Notifications