• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు భస్మాసుర హస్తం

By Pratap
|

Chandrababu Naidu
కఠోర తపస్సు చేసి తాను చేయి పెడితే భష్మం కావాలని రాక్షసుడు ఒకతను శివుడి నుంచి వరం పొందాడు. అతడే భస్మాసురుడు. వరమిచ్చే శివుడిపైనే చేయి పెట్టి వర ప్రభావాన్ని నిరూపించుకోవాలని అతను ప్రయత్నించాడు. శివుడి రక్షణకు విష్ణువు రంగంలోకి దిగాడు. అపురూపమైన విష్ణువు స్త్రీ సౌందర్యానికి ముగ్ధుడై తానేమి చేస్తున్నానో కూడా ఆలోచించకుండా తన తలపైనే తాను చేయి పెట్టుకుని ఆ రాక్షుసుడు కాలి బూడిదయ్యాడు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యవహారం ఉంది. తెలంగాణపై తాను తీసుకున్న వైఖరి తనకే ఎదురు తిరిగే సరికి గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని దానికి బాధ్యుల్ని చేసి దుమ్మెత్తిపోస్తున్నారు. పార్టీని కాపాడుకోవడానికి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. పొత్తుతో తెరాస చిత్తు చేయాలని ప్రయత్నించి అధికారం దక్కకుండా చేసుకున్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిరాహార దీక్ష అనంతరం పెల్లుబుకిని ప్రజా ఉద్యమానికి ప్రతిస్పందించి శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం పెడితే సమర్థిస్తామని చెప్పారు. తీరా ఆ సమయం వచ్చే సరికి, అది తన నాయకత్వానికే ఎసరు పెట్టేసరికి పాలుపోని స్థితిలో పడిపోయారు.

వ్యూహాత్మకంగా కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దాంతో కాంగ్రెసులో సంక్షోభం సరేసరి, తన పార్టీలోనూ సంక్షోభం తలెత్తేసరికి చేతులెత్తేస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోలేదనే తప్పుడు అంచనాలతో ఆయన తెలంగాణ విషయంలో ముందడుగు వేసి తెలంగాణ ప్రజల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెసులో చీలిక వస్తుందని, దాన్ని కాంగ్రెసు అహ్వానించబోదని, అందువల్ల తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం చేయడం సాధ్యమయ్యే పని కాదని ఆయన భావించి ఉంటారు. అటువంటి తప్పుడు అంచనాకు రావడానికి కారణం లేకపోలేదు. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివ రావులతో పాటు కాంగ్రెసు తెలంగాణేతర ఎంపీలు బహిరంగంగా తెలంగాణకు వ్యతిరేకంగా గొంతెత్తుతూ వచ్చారు. అలాగే, రాయలసీమ, కోస్తా కాంగ్రెసు శాసనసభ్యులు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఒక రకంగా కాంగ్రెసులోని తెలంగాణ, తెలంగాణేతర కాంగ్రెసు నాయకుల భిన్న వైఖరి చంద్రబాబు తప్పుడు అంచనాలకు కారణం. అనుకున్నట్లే కాంగ్రెసు పార్టీలో సంక్షోభం వచ్చింది. కానీ అది కాంగ్రెసుతో ఆగిపోలేదు. తన తెలుదేశం పార్టీలోనూ వచ్చింది. ప్రజారాజ్యం పార్టీలోనూ వచ్చింది.

తాము ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కచ్చితంగా కట్టుబడి ఉంటామని చెబుతూ వచ్చిన చంద్రబాబు తెలంగాణకు వచ్చేసరికి చేతులెత్తేశారు. తన పార్టీలో భిన్నవైఖరికి, తిరుగుబాటుకు కూడా కాంగ్రెసుపార్టీని, సోనియాను తప్పు పడుతున్నారు. తాను చెప్పినా తన రాజీనామాలు వెనక్కి తీసుకోవడానికి తన పార్టీ సభ్యులు వినడం లేదని తప్పించుకోజూస్తున్నారు. పైగా, తెలంగాణ ఉద్యమం పెల్లుబుకుతున్న సమయంలో కెసిఆర్ ఆరోగ్యం గురించో, తెలంగాణ ప్రజల ఆకాంక్ష గురించో మాట్లాడకుండా ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం గురించి మాట్లాడారు. పార్లమెంటులో చర్చ సందర్భంగా అన్ని పార్టీల సభ్యులు కెసిఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తే లోకసభలో తెలుగుదేశం సభ్యుడు నామా నాగేశ్వరరావు ప్రైవేట్ ఆస్తుల గురించి, వాటికి జరిగిన నష్టం గురించి మాట్లాడారు. శాంతిభద్రతల గురించి మాట్లాడారు. అయితే, తెలంగాణపై కాంగ్రెసు పార్టీ వైఖరిని కాకుండా, యుపిఎ ప్రభుత్వం వైఖరిని ప్రకటించడం ద్వారా కాంగ్రెసు ఢిల్లీ పెద్దలు తెలుగుదేశంలోనూ తమ సంక్షోభాన్ని సృష్టించారు. తమ పార్టీలో సంక్షోభం వస్తుందని వారికి తెలుసు. అందుకే తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల్లో సంక్షోభం సృష్టించడానికే ఏకంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ రకంగా చంద్రబాబును దెబ్బ కొట్టారు. కాంగ్రెసుకు ఇటువంటి సంక్షోభాలు కొత్తేమీ కాదు. చంద్రబాబుకే కొత్త. ఒక వేళ ఇప్పటి రాజీనామాల సంక్షోభాన్ని చంద్రబాబు స్వయంగా ప్రోత్సహించినా, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నా అది తెలుగుదేశం పార్టీపై తిరుగు లేని దెబ్బే అవుతుంది. చంద్రబాబు తన కాళ్ల కిందికి తాను నీళ్లు తెచ్చుకున్నారని చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X