స్పీకరుపై బాబు ఇంత చేయాలా?

తెలుగుదేశం హయాంలో తాను ఒక దళిత మహిళను(ప్రతిభాభారతి), ఒక బీసీని(యనమల రామకృష్ణుడు) స్పీకరుగా చేశానని, వైఎస్ మాత్రం తన కులస్ధుడైన కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ ని చేయడం ద్వారా సమాజంలో కింది వర్గాలకు అవకాశం లేకుండా చేశారని చంద్రబాబు నాయుడి అభిప్రాయం. ఆ విషయాన్ని ఆయన సభలో చెప్పలేరు. ఆయన పరిస్ధితి మింగలేకుండా కక్కలేకుండా అన్నట్టు తయారైంది.
చంద్రబాబు నాయుడి వ్యతిరేకతను, బాధను అర్ధం చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. చీఫ్ విప్ గా అధికారపార్టీ తరఫున మాట్లాడం ధర్మమని, ఇప్పుడు స్పీకరుగా తాను అందరివాడినని చెప్పారు. ప్రతిపక్షాలకు అభ్యంతరాలకు తన పనితీరే సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. ప్రజల ఆశలను ప్రతిబింబించే విధంగా సభను నడిపిస్తానని ఆయన అన్నారు.
స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ తరఫున అశోక్ గజపతిరాజును స్పీకరుగా పోటీకి నిలబెట్టడానికి ఆయన ఒక దశలో ముందుకు వచ్చారు. అయితే అశోక్ అయిష్టత వ్యక్తం చేయడం, మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించడంతో చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గక తప్పలేదు. స్పీకరు పదవికి కులం, ప్రాంతం అనే తోకలను తగిలించి తెలుగుదేశం పార్టీ విమర్శించడం తగదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
స్పీకరు అభ్యర్ధిత్వంపై ఇంతటి దుమారం రేగడం బహుశా ఇదే ప్రధమం. అయితే స్పీకరు దురుద్దేశాలను ఆపాదించడం తప్పు అవుతుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదిగా పేరున్న కిరణ్ కుమార్ రెడ్డి స్పీకరుగా ఎంతో పరిపక్వతతో, పక్షపాతం లేకుండా వ్యవహరించి ఆ పదవికి వన్నె తేవలసిన అవసరముంది. తెలుగుదేశం సభ్యులు కూడా మనసులో ఏదో పెట్టుకుని కాకుండా వ్యక్తిగత ద్వేషాల కు దూరంగా ప్రజాశ్రేయస్సే పరమావధిగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంది.












Click it and Unblock the Notifications