అటు చిరు, ఇటు కెసిఆర్

తెలంగాణ ఉద్యమం రాజకీయ నాయకుల చేతిలోంచి జారిపోకుండా కాంగ్రెసు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను శ్రీకృష్ణ కమిటీకి అనుకూలంగా మార్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా తిరిగి రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో అత్యధిక పార్లమెంటు సీట్లను సాధించడమే కాంగ్రెసు అధిష్టానం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకు గాను తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును చేరదీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే అందుకు కెసిఆర్ కూడా సుముఖత వ్యక్తం చేయవచ్చు. ఇప్పటికే ఈ విషయంలో ఓ నిర్ణయం జరిగిపోయినట్లుగా కూడా చెబుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి తెరాస, కాంగ్రెసు పార్టీల మధ్య అవగాహన కుదరవచ్చునని చెబుతున్నారు.
ఇదిలావుంటే, సీమాంధ్రలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని కూడా కాంగ్రెసు దువ్వుతున్నట్లు సమాచారం. చిరంజీవి కూడా అందుకు సిద్ధంగానే ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో ఆయన రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. తన బావ మరిది అల్లు అరవింద్ ను రాజ్యసభకు పంపాలని ఆయన అడిగినట్లు సమాచారం. అయితే, రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ తో సి. రామచంద్రయ్య పేరు కూడా ముందుకు వస్తోంది. అయితే ఏదో రీతిలో అల్లు అరవింద్ పేరు ఖరారు కావచ్చు. మజ్లీస్ కూడా రాజ్యసభ సీటును అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కె రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాష్ట్ర భద్రతా సలహాదారు కెవిపి రామచందర్ రావు అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, రాజ్యసభకు కాంగ్రెసు నుంచి పోటీ ఎక్కువగా ఉండడం వారిని ఆలోచన పడేస్తోందని అంటున్నారు.
సీమాంధ్రలో చిరంజీవిని ఆలంబనగా చేసుకుని తెలుగుదేశం పార్టీ దెబ్బ తీయాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం శాసనసభ్యులు చాలా మంది కాంగ్రెసుకు అనుకూలంగానే ఉన్నారు. కాంగ్రెసు కలిసి పనిచేయడం చిరంజీవికి కష్టం కాకపోవచ్చు. సమైక్య నినాదం తీసుకుని అందరి కన్నా ముందు సీమాంధ్ర పర్యటించి బలం పెంచుకోవడానికి చిరంజీవి అందులో భాగంగానే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా జైఆంధ్ర నినాదం తీసుకోవాలని చిరంజీవిపై కాంగ్రెసు నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మాజీ హోం మంత్రి కె. జానారెడ్డి మంగళవారం చిరంజీవిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద, కెసిఆర్, చిరంజీవిలతో కలిసి వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గట్టి పునాదిని తయారు చేయాలనేది కాంగ్రెసు ఎత్తుగడలో భాగమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications