వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సాధ్యమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
రాష్ట్ర పరిస్థితిపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని నిరుడు డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతూ శ్రీకృష్ణ కమిటీని వేసింది. శ్రీకృష్ణ కమిటీ తన పని సాగిస్తూ వస్తున్నది. నిజానికి, శ్రీకృష్ణ కమిటీ హేతుబద్దంగా, నిజాయితీగా వ్యవహరిస్తుందా అనే ప్రశ్న తెలంగాణ ప్రజలను వేధిస్తూనే ఉన్నది. మరో విషయం - శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందా అనేది మరో పెద్ద సందేహం. మొత్తం మీద, శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం రగులుతున్న సమస్య నుంచి పక్కకు తప్పుకుంది. ఓ రకంగా కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను శ్రీకృష్ణ కమిటీ సేకరిస్తున్నది. వారి అభిప్రాయాలను మాత్రమే కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందా, వారి అభిప్రాయాల్లోని హేతుబద్ధతను, సామంజస్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుందా అనేది తెలియడం లేదు. కేవలం అభిప్రాయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు గండి కొట్టినట్లే కావచ్చు. హైదరాబాదులో బలంగా ఉన్న మజ్లీస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రతిస్పందించింది. మజ్లీస్ పూర్తిగా కాంగ్రెసు ప్రభావంలో ఉందనేది అర్థమవుతూనే ఉన్నది. రాష్ట్ర విభజనపై ఆ పార్టీ ఇచ్చిన నివేదిక అది సీమాంధ్ర రాజకీయ ప్రాబల్యానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నదని కూడా తేలిపోతున్నది. కాంగ్రెసుతో తన రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉండడమే మజ్లీస్ వైఖరికి కారణంగా భావించవచ్చు. లేదంటే తన ప్రత్యర్థి అయిన బిజెపి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందున దానికి వ్యతిరేకమైన వైఖరిని మజ్లీస్ తీసుకుని ఉండవచ్చు.

ఇకపోతే, సిపిఎం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రతిస్పందించింది. ఆ పార్టీ క్రమక్రమంగా క్షీణిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలం నామమాత్రమే. కానీ మీడియా మేనేజ్ మెంటు వంటి వ్యవహారాల్లో ఆ పార్టీ ఆరితేరింది. అందువల్ల దాని గొంతు బలంగానే ఉంటుంది. సిపిఐ మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక సమర్పించింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పార్టీ విధానంగా ఒకే వైఖరిని తీసుకునే పరిస్థితిలో లేవు. మొత్తంగా సమస్య జటిలం కావడానికి ఈ రెండు పార్టీల వైఖరులే కారణం. రాష్ట్రంలో ఈ రెండు బలమైన పార్టీలు. ఈ రెండు పార్టీలు ఒకే వైఖరిని తీసుకుని ఉంటే అందుకు అనుగుణంగా వ్యవహారాలు సాగి ఉండేవి. తెలంగాణ బిల్లు పెడితే బలపరుస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండు వైఖరుల గురించి మాట్లాడుతున్నారు. తమ పార్టీ రెండు వైఖరులను తీసుకుందని చెబుతున్నారు. ఒక అంశంపై పార్టీకి రెండు భిన్నమైన వైఖరులు ఎలా ఉంటాయని చంద్రబాబును అడిగే దమ్ములు మీడియా ప్రతినిధులకు ఉన్నట్లు లేవు. కాంగ్రెసు మాత్రం రెండు వైఖరులను ప్రోత్సహిస్తూ వస్తున్నది. సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమైక్యాంధ్ర కోసం శివాలెత్తుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసమే పనిచేస్తున్నప్పటికీ దాని వాదన ఏ మేరకు నెగ్గుతుందనేది సమస్యే. వాదనా పటిమ ఉన్న, అందులో పస ఉన్నా, న్యాయం ఉన్నా అందుకు అనుగుణమైన నిర్ణయం జరుగుతుందని చెప్పలేం. పైగా, తెరాసను రూపుమాపడానికి అన్ని పార్టీలు పని చేస్తున్నాయి. లాబీయింగులో గానీ, ప్రాబల్యంలో గానీ రాష్ట్ర రాజకీయాల్లో సీమాంధ్ర నేతలదే పైచేయి. అందువల్ల తెలంగాణ నెగ్గుతుందని చెప్పలేం. కేంద్ర ప్రభుత్వం లేదా కాంగ్రెసు పార్టీ ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉంటే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. వాదనలతో, విన్నపాలతో మనసులు మార్చే పరిస్థితి రాజకీయాల్లో లేకుండా పోయింది. సమాజంలో కూడా దానికి స్థానం లేకుండా పోయింది. నిర్ణయాలు తీసుకునే వారు తమకు ప్రయోజనం చేకూర్చే పనులు మాత్రమే చేస్తారు. రాష్ట్ర విభజన వల్ల తమకు లాభం చేకూరుతుందని భావిస్తే తప్ప కాంగ్రెసు అందుకు పూనుకోకపోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X