శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ చెడగొట్టుకున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చేజేతులా చెడగొట్టుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పదవి దక్కదని భావించి తిరుగుబాటు చేసి పార్టీ నుంచి బయటకు రావాలనే వ్యూహంతో జగన్ పని చేస్తున్నా అది తప్పేననే భావన చాలా మంది అంటున్నారు. సహనం లోపించడం, తప్పుడు అంచనా జగన్ లోని పెద్ద లోపమని చెబుతున్నారు. అత్యంత సన్నిహితులు, అనుభవజ్ఞులు చెబుతున్నా ఆయన వినిపించుకోవడం లేదు. ఆయనకు భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నవారు కూడా ఆయన తీరును ఆహ్వానించలేకపోతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు కెవిపి రామచందర్ రావు చెప్పినా జగన్ వినడం లేదని అంటున్నారు. ఆధునిక కాలానికి సరిపడని ఆలోచనగా జగన్ రామచందర్ రావు సలహాలను బేఖాతరు చేస్తున్నట్లు భావిస్తున్నారు. పోటీ ప్రపంచంలో వ్యక్తిగతంగా దూసుకుపోవడం ద్వారానే విజయాలు సాధిస్తామని జగన్ నమ్ముతున్నట్లు భావించవచ్చు. అధిష్టానం మాట వింటే భవిష్యత్తు బాగుంటుందని, అనువు గాని వేళ మౌనం వహించాలని కెవిపి రామచందర్ రావు జగన్ కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

వైయస్ రాజశేఖర రెడ్డి శిష్యుడు, మంత్రి రఘువీరా రెడ్డి కూడా జగన్ తీరును ఆహ్వానించలేకపోతున్నారు. అధిష్టానం మాట వినాలని ఆయన అన్ని విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అలాగే, ప్రస్తుత మంత్రి వర్గంలో వైయస్ ను అభిమానించేవాళ్లు, ఆరాధించేవాళ్లున్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డి మినహా మిగతా మంత్రులెవరూ జగన్ తీరును మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డి వైయస్ కుటుంబానికి సన్నిహిత బంధువు కావడం వల్ల జగన్ ను అంటి పెట్టుకుని ఉండే అవకాశాలున్నాయి. శాసనసభ్యుల్లో చంద్రశేఖర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, గర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కొండా సురేఖ వంటి పది మంది దాకా జగన్ వెంట ఉండడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతగా లెక్క వేసుకున్నప్పటికీ పార్టీని కాదని జగన్ తో వచ్చే శాసనసభ్యులు డజనుకు మించి ఉండదని అంటున్నారు. జగన్ కాంగ్రెసులోనే ఉండాలని, కాంగ్రెసులోని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్న శ్రేయోభిలాషులను లెక్క వేస్తే మాత్రం మెజారిటీ జగన్ కే పడుతుంది. కాంగ్రెసు ఉంటే జగన్ తో ఉండడానికి చాలా మంది శాసనసభ్యులు, మంత్రులు ఇష్టపడుతున్నారు. జగన్ పార్టీని వీడితే వెంట వెళ్లడానికి మాత్రం సుముఖంగా లేరు. ఈ విషయాన్ని జగన్ పరిగణనలోకి తీసుకోకుండా దూకుడుగా, ఏకపక్షంగా ముందుకు సాగుతున్నారనే వేదన చాలా మందిలో ఉంది.

సోనియా గాంధీ మాట, అధిష్టానం మాట వింటే జగన్ కు పార్టీలోనే మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశాలుండేవని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. జగన్ మొండిపట్టు వల్ల, అసహనం వల్ల, దూకుడు వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే భావన ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైయస్ జగన్ కు ఇప్పటికే ఇవ్వాల్సిన గౌరవం, స్థానం ఇచ్చామని అధిష్టానం భావించింది. తాము ఇస్తున్న గౌరవాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నాడనే అభిప్రాయం సోనియా గాంధీలో బలంగా నాటుకుపోయిందని అంటున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేది తానే అన్నట్లుగా మాట్లాడడం కూడా సోనియాకు నచ్చడం లేదని చెబుతున్నారు. పైగా, పార్టీ కన్నా వైయస్ కు ప్రాధాన్యం ఇవ్వడం ఏ మాత్రం రుచించడం లేదు. పార్టీ వల్లనే వైయస్ ముఖ్యమంత్రి కాగలిగారని, పార్టీ అండదండలతోనే వైయస్ పథకాలను ప్రకటించి, అమలు చేయగలిగారని, వైయస్ సొంతంగా చేశారనే అభిప్రాయం కలిగిస్తూ జగన్ వ్యవహరించడం సోనియాకు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. తాము లేకుండా వైయస్ లేరని, తాము లేకుండా జగన్ ఉండలేరని, ఈ విషయాన్ని జగన్ గుర్తించడం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని నిలబెట్టింది తన తండ్రి, నిలబెట్టేది తాను అనే విధంగా వ్యవహరించడాన్ని జగన్ అహంకార ప్రదర్సనగా భావిస్తున్నారు. దీంతో పరిస్థితి తెగే దాకా వచ్చింది. జగన్ కు పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ సమీప భవిష్యత్తులో మంచి అవకాశం ఉండబోదని తేలిపోయింది. ఇప్పుడు తేల్చుకోవాల్సిందే జగనే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X