వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నుంచి కెసిఆర్ కాపాడుతారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
కాంగ్రెసుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మక దూరాన్ని కూడా పాటించడం లేదు. కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావుతో భేటీ కావడం కెసిఆర్ దానికి కూడా స్వస్తి చెప్పారనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది. కెసిఆర్ కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని, తమ పార్టీని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా, కాంగ్రెసును బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. అంటే, కాంగ్రెసు పార్టీకి ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నుంచి ముప్పు ఏర్పడినా రక్షించడానికి సిద్ధపడ్డారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వైయస్ జగన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కెసిఆర్ మద్దతు కూడగట్టడానికి అధిష్టానం కేశవరావుపైన పెట్టిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెసు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మద్దతును కాంగ్రెసు సంపాదించింది. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెసు నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలోనే కేంద్ర ప్రభుత్వం హామీని నిలబెట్టుకోకపోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. దానికి మించి, మంత్రివర్గ విస్తరణ జరిపి ముఖ్యమంత్రి రోశయ్య ప్రజారాజ్యం పార్టీకి స్థానం కల్పించకపోవడంపై కూడా ఆయన అలక వహించినట్లు భావిస్తున్నారు.

వైయస్ జగన్ రోశయ్య ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి పూనుకుంటే ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఎంత మంది చిరంజీవి మాట వింటారనేది కూడా అనుమానంగానే ఉంది. శాసనసభ్యుల మాట ఎలా ఉన్న జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు వైయస్ జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందు వల్ల ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరింత పకడ్బందీ పథకాన్ని అనుసరించాల్సిన స్థితిలో కాంగ్రెసు పడిందని అంటున్నారు. అందుకే, కేశవరావు ద్వారా కథ నడిపి కెసిఆర్ మద్దతు సంపాదించడానికి కాంగ్రెసు అధిష్టానం పూనుకుందని అంటున్నారు. అందులో భాగంగానే కేశవరావుకు, కెసిఆర్ కు మధ్య సుదీర్ఘ మంతనాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎగదోస్తున్న సమయంలో దాన్ని అడ్డుకోవడం కెసిఆర్ కు అవసరంగా మారిందని అంటున్నారు. జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తే తెలంగాణ ఉద్యమాన్ని డిసెంబర్ తర్వాత ఉధృతం చేయడం అంత సులభం కాదని, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉంటేనే ఉద్యమం తాను అనుకున్న పద్ధతిలో నడుస్తుందని కెసిఆర్ భావించి కేశవరావుతో మాట్లాడినట్లు చెబుతున్నారు. కెసిఆర్ ను దగ్గర చేయడం ద్వారా కాంగ్రెసు వర్కింగ్ కమిటీలో స్థానమో, ముఖ్యమంత్రి పదవో కొట్టేయాలని కేశవరావు భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆర్ కు స్ఫష్టమైన సంకేతాలు కేశవరావు ద్వారా కాంగ్రెసు అధిష్టానం అందించిందనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ ఇస్తే తాను పూర్తిగా కాంగ్రెసు వైపు నుంచి ఉంటాననే స్పష్టమైన హామీని కెసిఆర్ నుంచి అధిష్టానం కోరిందా అనేది కూడా ప్రశ్నగానే ఉంది. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడమే కాకుండా కాంగ్రెసుకు బలం చేకూరడానికి తమతో కలిసి పనిచేసేందుకు ఒప్పందానికి రావాలని కూడా కెసిఆర్ పై కాంగ్రెసు అధిష్టానం ఒత్తిడి తెచ్చినట్లు భావిస్తున్నారు. అందుకు ముందస్తు హామీ కావాలని కాంగ్రెసు కెసిఆర్ ను కోరినట్లు సమాచారం. ఈ స్థితిలోనే కెసిఆర్ అవసరమైతే కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడడానికి, తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెసు ప్రభుత్వం మాత్రమే ఏర్పడేందుకు కెసిఆర్ హామీ ఇవ్వడంలో భాగంగానే కెసిఆర్, కేశవరావు కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏమైనా, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలను మాత్రం కాదనలేం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X