తెలంగాణ విమోచన హంగామా

దేశమంతా ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలకులను నుంచి స్వాతంత్ర్యం పొందగా హైదరాబాదు రాజ్యం మాత్రం నైజాం ఏలుబడిలోనే ఉంది. అది ఒక స్వతంత్ర దేశంగా భారతదేశం మధ్యలో ఉంది. దేశమంతా స్వాతంత్ర్యం సాధించిన తర్వాత కూడా హైదరాబాదు రాజ్యంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగుతూనే ఉన్నది. హైదరాబాదును స్వతంత్ర రాజ్యంగా ప్రకటింపజేసుకోవడానికి నిజాం ఐక్యరాజ్య సమితి దాకా వెళ్లారు. అయితే, అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ హైదరాబాదు రాజ్యం మీదికి యూనియన్ సైన్యాలను పంపారు. యూనియన్ సైన్యాలు నిజాం సైనికుల మీదనే కాకుండా సాయుధ పోరాటం సాగిస్తున్న కమ్యూనిస్టులపై కూడా యుద్ధం ప్రకటించాయి. దాదాపుగా యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సమయంలో నిజాం సెప్టెంబర్ 17వ తేదీన భారత యూనియన్ కు లొంగిపోయారు. దాంతో భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం విలీనమైంది. దాన్నే తెలంగాణ ప్రజల కోసం స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ బలంగా వస్తోంది. ఈ డిమాండ్ చాలా కాలంగా ఉన్నప్పటికీ ఈసారి మరింత ఊపందుకుంది.
భారత యూనియన్ లో విలీనమైన తర్వాత హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగింది. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో కర్నాటకలోని బళ్లారి తదితర ప్రాంతాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. భాషా ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఆ రాష్టాలకు వెళ్లాయి. తెలంగాణ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కలిసింది. దీంతో తెలంగాణలో ఆగస్టు 15వ తేదీన్నే స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోంది. సెప్టెంబర్ 17 దాదాపుగా విస్మరణకు గురైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉద్యమం ముందుకు వచ్చిన తర్వాత ఆ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం జరపాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. గత హైదరాబాద్ రాజ్యంలోని ప్రాంతాల్లో కర్నాటక, మహారాష్ట ప్రభుత్వాలు అదికారికంగా సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఆ రాష్ట్రాలు అధికారికంగా నిర్వహించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటనేది ప్రశ్న.












Click it and Unblock the Notifications