• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ జగన్ సలహాదారులు

By Pratap
|

YS Jagan
రాజకీయాల్లో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సలహాదారులు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిలకడ లేని ఆయన వ్యవహార శైలి ఈ చర్చకు కారణమైంది. దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు ఉంటూనే వెనక్కి తగ్గే జగన్ తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మాటలు ఎలా ఉన్నా జగన్ వ్యవహారంలో సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనే ఆకాంక్షనే వ్యక్తమవుతూ వస్తోంది. పరిపక్వత, సహనం కొరవడినట్లు కనిపిస్తున్నట్లు ఆయన వ్యవహరించడానికి వెనక గల వ్యక్తుల గురించిన చర్చ సాగుతోంది. కచ్చితంగా ఆయన కెవిపి రామచందర్ రావు మాటలు వినడం లేదనేది మాత్రం స్పష్టమవుతూనే ఉన్నది. కెవిపిని ఆయన అధికారం చేపట్టడానికి పార్టీ అధిష్టానం వద్ద ఒక పావుగానే వాడుకోవాలని చూస్తున్నట్లు మాత్రం అర్థమవుతోంది.

కాస్తా సీనియర్లు అయిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, రఘువీరా రెడ్డి ఆయనకు సలహాదారులుగా ఉండవచ్చునని అనుకోవడానికి వీలుంది. అయితే, ఆయన సబితా ఇంద్రారెడ్డి చెప్తే వినే స్థితిలో కూడా లేరని అంటున్నారు. ఏదో మేరకు రఘువీరా రెడ్డి మీద ఆయన ఆధారపడినట్లు చెప్పవచ్చు. ఈ నెల 8వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవడానికి రఘువీరా రెడ్డి మాటలే ఆయన మీద పని చేసినట్లు చెబుతున్నారు. రఘువీరా రెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ శిష్యుడు. రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న కాలంలో రఘువీరా రెడ్డి కాంగ్రెసు అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐలో పనిచేస్తున్నారు. ఓ కార్యక్రమానికి వైయస్ ను రఘువీరా ఆహ్వానించారు. అప్పటి నుంచి వారి మధ్య అనుబంధం పెరిగింది. దానివల్ల ఏదో మేరకు రఘువీరా జగన్ ను కట్టడి చేయడానికి అవకాశం ఉంది.

కానీ, జగన్ వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా రఘువీరా మీద ఆధారపడి లేరని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ వంటి నలుగురైదుగురు జగన్ వ్యూహరచనలో పాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, సాక్షి టెలివిజన్ చానెల్ సిఇవో రామ్ అయనకు అత్యంత సన్నిహితుడు. రామ్ కు ఓ యాడ్ ఏజెన్సీ ఉంది. వైయస్ హయాంలోనే ఆ యాడ్ ఏజెన్సీ పెద్ద యెత్తున వ్యాపారం నడిపింది. సాక్షి దినపత్రికను పెట్టిన తర్వాత ఆయన దాంట్లోకి వచ్చారు. రామ్ కు నెమ్మదిగా, ఆచితూచి వ్యవహరించడం నచ్చదంటారు. ఆధునిక ప్రపంచంలో దూకుడుగా, వేగంగా ముందుకు కదలాలని అంటారట. జగన్ కూడా ఒక్కటి మనసులో అనుకుంటే వెనక్కి తగ్గరనే అభిప్రాయం ఉంది. దానివల్ల రామ్ సలహాలు జగన్ చెవికి ఇంపుగా ఉంటాయట. ఆనం సోదరులు కూడా వైయస్ జగన్ కు సన్నిహితంగానే ఉండేవారు. చాలా మంది ఆయనకు అనుచరులుగా ఉన్నారు. వీరందరినీ ఆయన అనుచరులుగానే చూస్తారు తప్ప సలహాదారులుగా చూడరని చెబుతారు. అయితే, అధిష్టానాన్ని ధిక్కరించి జగన్ వెంట వచ్చేందుకు వారు సిద్ధంగా లేరు. అందుకు ప్రధాన కారణం తమ భవిష్యత్తుపై భయం కన్నా జగన్ వ్యవహారం బెడిసికొడుతుందనే భయమే.

జగన్ కు చాలా మంది నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప పార్టీని కాదని ఆయన వెంట నడిచే పరిస్థితి లేదు. ఆయనకు అంతటి నాయకత్వ లక్షణాలు లేవని కూడా చాలా మంది నమ్ముతున్నారు. ఇది జగన్ పెద్ద మైనస్ పాయింట్ అయ్యే ప్రమాదం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X