వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పొలిటిక్స్: కొత్త సీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కొత్త మలుపు తిరుగుతోంది. ఇంత వరకు వైయస్ జగన్ వర్గం తమ పనేదో తాము చేసుకుపోతున్నారు. కొంత మంది పార్టీ సీనియర్ నాయకులు, పార్టీలోని ప్రతికూలురు జగన్ ఓదార్పు యాత్రను తప్పు పడుతూ వస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయట పెడుతూ వస్తున్నారు. కానీ, జిల్లా స్థాయిల్లో ఆయనకు పెద్దగా వ్యతిరేకత ఎదురు కాలేదు. ఆయన ప్రతికూల వర్గం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వచ్చింది. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆయన ఓదార్పు యాత్ర సజావుగా సాగింది. ప్రకాశం జిల్లాకు వచ్చే సరికి కొంత సీన్ మారింది. పార్టీ అధిష్టానం వైఖరి స్పష్టం కావడంతో శాసనసభ్యులు, నాయకులు ఆయన ఓదార్పు యాత్రకు దూరంగా ఉండగలిగారు.

ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర కొనసాగుతుండగానే సీన్ మరో మలుపు తిరిగింది. జిల్లా స్థాయిల్లో జగన్ వర్గానికి, వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా జగన్ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనే సూచనలు కూడా అందుతున్నాయి. నెల్లూరు జిల్లా ఘటనను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి జగన్ ఓదార్పు యాత్ర ప్రవేశించక ముందే నెల్లూరులో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నెల్లూరులో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ప్రతిష్టాపనపై తీవ్ర ఘర్షణ చెలరేగింది. విగ్రహ ప్రతిష్ఠాపనకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మహానేతగా చెబుతున్న వైయస్ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఈ విధమైన వ్యతిరేకత ఎదురు కావడాన్ని బట్టి భవిష్యత్తు రాజకీయాలను ఊహించవచ్చు. వైయస్ రాజశేఖర రెడ్డికి ఇవ్వాల్సినంత గౌరవం మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, అంతకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెప్పవచ్చు. ఇంతకాలం వైయస్ గొప్పతనం గురించి తక్కువగా మాట్లాడని నాయకులు ఇప్పుడు అందుకు కూడా సిద్ధపడేందుకు తయారవుతున్నట్లు భావించవచ్చు.

నెల్లూరులో జగన్ వ్యతిరేకులకు, అనుకూలరకు మధ్య చెలరేగిన వివాదం మిగతా జిల్లాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓదార్పు యాత్రపై అధిష్టానం వైఖరి స్పష్టం కావడంతో జగన్ ను వ్యతిరేకించే వర్గం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇంత వరకు మౌనంగా ఉంటూ వస్తున్న ఈ వర్గం పైకి లేచి జూలు విదిలించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రతి చోటా ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటుందనడంలో సందేహం లేదు. ప్రతి జిల్లాలోనూ కాంగ్రెసులో రెండు వర్గాలున్నాయి. ఈ రెండు వర్గాలు మళ్లీ తలెత్తి వివాదాలకు, ఘర్షణలకు కారణం కావచ్చు. ఇదే జరిగితే జగన్ రాజకీయం ఇప్పుటంతా సాఫీగా సాగడం కష్టమే అవుతుంది. మరో వైపు జగన్ వ్యతిరేకులకు అధిష్టానం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది. దానివల్ల జగన్ వ్యతిరేకులది పైచేయి అవుతుంనడంలో సందేహం లేదు. దానివల్ల జగన్ రాజకీయం పూలబాట కాదు, ముళ్లబాట అవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X